సింహాల నడుమ డెలివరీ

- June 30, 2017 , by Maagulf
సింహాల నడుమ డెలివరీ

క్కడో దూరాన సింహం కనిపిస్తేనే ప్రాణభయంతో పరుగులు పెడతాం. మరి అలాంటిది ఏకంగా 12 సింహాలు చుట్టుముడితే. వామ్మో! ఇంకేముంది.. పై ప్రాణాలు పైనే పోతాయి. వాటి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణి పండండి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ సంఘటన గుజరాత్లోని అమ్రేలి దగ్గర లున్సాపూర్లో జరిగింది.

జఫ్రాబాద్ గామ్రానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో కుటుంబసభ్యులు వెంటనే 108కి ఫోన్ చేసి అంబులెన్స్ను పిలిపించారు. అందులో ఆమెను ఎక్కించి ఆసుపత్రికి తరలిస్తున్నారు. వాళ్ల గ్రామానికి సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరంలో అంబులెన్స్ ఆగిపోయింది. అంబులెన్స్ వెళ్తున్న రోడ్డుపై 11-12 మృగరాజులు దర్జాగా తిరుగుతున్నాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వెంటనే అంబులెన్స్ను మృగరాజులు చుట్టుముట్టేశాయి. ఓ వైపు ప్రాణభయం.. మరోవైపు నొప్పులతో బాధపడుతున్న గర్భిణి. ఎంతసేపు ఎదురుచూసినా సింహాలు అక్కడి నుంచి వెళ్లిపోలేదు. అప్పటికే ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో అంబులెన్స్లోని సిబ్బంది వైద్యులకు ఫోన్ చేశారు. ఫోన్లో వైద్యులు చెబుతున్న దాని ప్రకారం సిబ్బంది ఆమెకు డెలివరీ చేశారు. డెలివరీకి దాదాపు 25 నిమిషాల సమయం పట్టింది. అంతసేపు ఆ అంబులెన్స్ సింహాల మధ్యనే ఉండిపోయిందని అమ్రేలి 108 అంబులెన్స్ సర్వీస్ హెడ్ చేతన్ గధియా తెలిపారు. సింహాలు ఆ అంబులెన్స్పై దాడి చేయకపోవడం అదృష్టం.

పాప పుట్టిన కొద్ది సేపటికి సింహాలు వెళ్లిపోవడంతో వెంటనే తల్లీ, బిడ్డను జఫ్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు సాధారణమట. అందుకే అంబులెన్స్లో ఉండే వాళ్లకు ముందుగానే శిక్షణ ఇస్తారు. ఆ సమయంలో బెదిరిపోకుండా నిబ్బరంగా ఎలా ఉండాలి? పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలి? అనే దానిపై సిబ్బందికి శిక్షణ ఇస్తామని గధియా చెప్పుకొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com