యూఏఈ జలాలలో చిక్కుకుపోయిన 100 మంది భారతీయ నావికులు

- July 02, 2017 , by Maagulf
యూఏఈ జలాలలో చిక్కుకుపోయిన 100 మంది భారతీయ నావికులు

దుబాయ్: అరబ్ జలాల్లో ఉన్న 22 నౌకల్లో దాదాపు వందమంది వరకు చిక్కుకుపోయిన భారత నావికులు తమను రక్షించాల్సిందిగా దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయాన్నివేడకుంటున్నారు. ఈ విషయమై  భారత దౌత్య అధికారి విపుల్ మాట్లాడుతూ యూఏఈ జలాల్లో చిక్కుకుపోయిన నావికుల నుంచి రక్షించమని కోరుతూ ఫోన్ కాల్స్ వస్తున్నట్టు తెలిపారు. మొత్తం 22 నౌకల్లో 97 మంది ఉన్నట్టు పేర్కొన్నారు. వీటిలో ఉన్న విదేశీ సిబ్బంది గురించిన సమాచారం రాయబార కార్యాలయం వద్ద లేదన్నారు. అయితే అందులో శ్రీలంక, ఫిలిప్పీన్స్, మయన్మార్, పాకిస్థాన్‌కు చెందిన నావికులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి గత కొన్ని నెలలుగా వేతనాలు అందడం లేదని, ఆహార పదార్థాలు, తాగునీరు, ఇంధనం కూడా నిండుకున్నట్టు నావికులు చెబుతున్నట్టు విపుల్ తెలిపారు. తమను తిరిగి స్వదేశాలకు పంపించే ఏర్పాట్లు చేయాల్సిందిగా వారు కోరుతున్నట్టు పేర్కొన్నారు. దీంతో వారి వేతనాలు చెల్లించేలా యజమానులు, ఏజెంట్లపై ఒత్తిడి తీసుకురానున్నట్టు రాయబార కార్యాలయం తెలిపింది. మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు ఎంవీ గల్ఫ్ పెరల్, ఎంవీ ఆయా, ఎంజాజ్ 2, ఎంవీ సలీమ్, ఎంవీ రాక్, అల్ హమద్1 నౌకల్లో చిక్కుకుపోయిన 36 మందిని రక్షించి సొంత దేశాలకు పంపారు. కొందరికి నీళ్లు, ఆహారం, ఇంధనం సమకూర్చడంతోపాటు వారి మొబైల్ ఫోన్లను రీచార్జ్ కూడా చేసినట్టు విపుల్ తెలిపారు. త్వరలోనే మిగతా వారిని కూడా రక్షించి స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com