జర్మనీలో ఘోర రోడ్డు ప్రమాదం..18 మంది మృతి

- July 03, 2017 , by Maagulf
జర్మనీలో ఘోర రోడ్డు ప్రమాదం..18 మంది మృతి

జర్మనీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బవేరియా రాష్ట్రంలోని మ్యుఎన్చ్‌బర్గ్ వద్ద హైవే-ఏ9పై బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో మంటలు చెలరేగి 18 మంది మృతిచెందారు. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో సీనియర్ సిటిజన్లతో హైవేపై వెళ్తున్న బస్సు, ట్రక్కు బలంగా ఢీకొన్నాయి. దీంతో బస్సు, ట్రక్కులో భారీగా మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న మొత్తం 48 మందిలో 18 మంది సజీవ దహనం కాగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందాలు మంటలను పూర్తిస్థాయిలో ఆర్పేశాయి. గాయపడిన వారిని హెలికాప్టర్లు, అంబులెన్స్‌ల ద్వారా దవాఖానలకు తరలించారు. 

బస్సులో ఉన్న వారిని తూర్పు జర్మనీలోని సాక్సోనీ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. జర్మనీ ఫెడరల్ పోలీసు కార్యాలయం నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు పూర్తిగా దగ్ధమైన వాహనంలోని మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు దారుణంగా దెబ్బతిన్నందున పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయని, కేసు దర్యాప్తు సైతం చాలా సంక్లిష్టంగా ఉన్నదని పోలీసు అధికారప్రతినిధి ఇరేన్ బ్రాండెన్‌స్టయిన్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన హైవేను పోలీసులు రెండువైపులా మూసేశారు. ప్రయాణికులు ఈ రహదారి గుండా వెళ్లవద్దని, ఒకరోజుపాటు దీన్ని మూసేస్తున్నట్లు అధికారులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా ఓ ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ప్రమాదం కారణంగా బెర్లిన్, మ్యూనిచ్ నగరాల మధ్య ప్రధాన రహదారిగా ఉన్న ఏ9పై భారీగా ట్రాఫిక్ జాం అయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com