మరో 15 వేల వీసాలకు యు.ఎస్ అనుమతి

- July 18, 2017 , by Maagulf
మరో 15 వేల వీసాలకు యు.ఎస్ అనుమతి

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక అగ్రరాజ్యం అమెరికా తన వీసాల జారీ ప్రక్రియను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వలస విధానాలపై సైతం ఆంక్షలు విధించారు. దీంతో అక్కడి సంస్థలన్నీ స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా అమెరికా ప్రభుత్వంఅదనంగా మరో 15వేల వీసాలను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ వార్షిక సంవత్సరంలో హెచ్‌-2బీ ప్రోగ్రాం కింద తాత్కాలిక వ్యవసాయేతర కార్మికులకు వీటిని జారీ చేయనుంది. డిపార్ట్‌మెంట్స్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ ప్రకటన ప్రకారం.. పిటిషనర్లు తాము ఈ వార్షిక ఏడాదిలో హెచ్‌-2బీ కింద కార్మికులను సమకూర్చుకోపోతే తమ వ్యాపారం తీవ్రంగా నష్టపోతామని పేర్కొంటూ విధిగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. అమెరికాలోని కొన్ని వ్యాపారాలకు అవసరమైన నిపుణులైన స్థానిక కార్మికులు అందుబాటులో లేని కారణంగా సెక్రటరీ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ జాన్‌ కెల్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అధ్యక్షుడు ట్రంప్‌ అమెరికా కార్మికుల కోసం ఈ వారాన్ని 'మేడ్‌ ఇన్‌ అమెరికా' గా ప్రకటించిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

డిమాండ్‌కు తగినట్లు నిపుణులైన తాత్కాలిక కార్మికులు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడి వ్యాపారంపై అది తీవ్ర ప్రభావం చూపుతోందని.. దాన్ని కాపాడేందుకు తగిన నిర్ణయం తీసుకునేలా కాంగ్రెస్‌ తనకు అధికారమిచ్చిందని జాన్‌ కెల్లీ చెప్పారు.

ఏడాదిలో హెచ్‌-2బీ కింద 66వేల వీసాలకు కాంగ్రెస్‌ పరిమితి విధించింది. తొలి అర్థ సంవత్సరంలో 33వేల వీసాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com