భాగ్యనరంలో భారీ వర్షాలు.. వరద మయం.. జనజీవనం అస్తవ్యస్థం
- July 18, 2017
హైదరాబాద్ ముసురేసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో జలమలమైంది. వరద నీరంతా రోడ్లపైకి చేరడంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఇన్‌ఫ్లో కు అనుగుణంగా నీటిని విడుదల చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోడ్లపై నీటిని తొలగించేందుకు శ్రమిస్తున్నారు. ఇక వాన నీరు, గతుకుల రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లో నాన్‌స్టాఫ్‌గా వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా
కోర్ సిటీతో పాటు శివారులోనూ భారీ వర్షం కురిసింది. కుండపోత వానతో మాదాపూర్ , శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, హయత్‌నగర్, బండ్లగూడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ఇళ్లలోకి నీరు చేరింది. నగరంలోని రోడ్లన్నీ కాలువలను తలపించాయి. మ్యాన్ హోళ్లు పొంగడంతో ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే భయపడిపోయారు.
నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి వరద నీరు భారీగా చేరడంతో హుస్సేన్‌సాగర్ పూర్తిగా నిండిపోయింది. సాగర్‌లోకి ఇన్‌ఫ్లో 2 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా..600 క్యూసెక్కులను దిగువకు వదిలారు. నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా.. పరివాహక నాలాల చుట్టూ ఉన్న బస్తీ కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గ్రేటర్ పరిధిలోని 169 చెరువులు నిండుకుండల్లా మారాయి.ప్రమాదకరస్థాయికి చేరుకున్న 10 చెరువుల పరిధిలోని ముంపువాసులను అలెర్ట్ చేశారు.
భారీ వర్షాలతో హైదరాబాద్ రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి.గతుకుల రోడ్లపై వాహనదారులు నానా తంటాలు పడుతున్నారు.ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో రవాణాకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. ట్రాఫిక్ కష్టాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను , టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. రోడ్లపై నిలిచిపోయిన నీటిని, నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు రెస్క్యూ టీంలు, ప్రత్యేక వాహనాలను రంగంలోకి దింపింది. కమాండ్ కంట్రోల్ రూం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు. ఇబ్బంది ఉన్న ప్రాంతానికి క్విక్ యాక్షన్ టీంలను పంపిస్తున్నారు.
మరోవైపు గత సంవత్సరం ముంపునకు గురైన నిజాంపేట బండారిలే అవుట్ మరోసారి నీట మునిగే పరిస్థితి వచ్చింది. గతంలో తీసుకున్న కొన్ని చర్యల కారణంగా చాలా వరకూ వరదనీరు బయటకు వెళ్తున్నా కొన్ని కాలనీలకు మాత్రం ముప్పు ముంచే ఉంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వాయుగుండం తీరం దాటినా మరో మూడో రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరికొన్ని మాన్‌సూన్ బృందాలను GHMC మోహరిస్తోంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







