తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా కృష్ణానది పై ఐకానిక్ బ్రిడ్జ్‌

- July 21, 2017 , by Maagulf
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా కృష్ణానది పై ఐకానిక్ బ్రిడ్జ్‌

అమరావతి నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజైన్లు కూడా ఖరారయ్యాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కృష్ణా నదిపై నిర్మించ తలపెట్టిన ఐకానిక్ బ్రిడ్జ్ నమూనాలు కూడా సిద్ధమయ్యాయి. రెండునిర్మాణ సంస్థలు రూపొందించిన డిజైన్లలో ఒకదాన్ని ఏపీ ప్రభుత్వం ఫైనల్ చేయనుంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అమరావతి రూపుదిద్దుకోనుంది. రాజధానిలో నవ నగరాలతో పాటు ఐకానిక్ బ్రిడ్జ్‌లను కూడా నిర్మించబోతోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి  రెండు సంస్థలు రూపొందించిన డిజైన్లు ప్రభుత్వానికి చేరాయి. వీటిని పరిశీలించి..ఒక నమూనాను  ఫైనల్ చేయనున్నారు చంద్రబాబు. 
ప్రపంచస్థాయి నగరంగా నిర్మించనున్న అమరావతిలో ప్రతి కట్టడాన్ని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దేశ, విదేశాల్లోని అద్భుత నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. కృష్ణానదిపై రెండు ఐకానిక్ వంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి గత మార్చిలోనే ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ ఆరు ఆకృతులను ప్రభుత్వానికి అందించింది. నమస్కార ముద్ర, కూచిపూడి నృత్య భంగిమ, కూచిపూడి అరల ముద్ర, పుష్పాన్ని పోలిన ఆకృతిలో రెండు అంతస్తుల్లో ప్రజావారధి, అమరావతి స్థూపం, కొండపల్లి బొమ్మ ఆకృతులను ప్రభుత్వానికి సమర్పించింది. అన్ని నమూనాలు బాగున్నాయని చెప్పిన చంద్రబాబు..తెలుగు సంప్రదాయ నృత్యరీతి-కూచిపూడి ముద్ర ఆకృతిలో వున్న ఐకానిక్ వారధి వైపు మొగ్గు చూపారు. పవిత్ర సంగమం నుంచి కృష్ణా నది మీదుగా రాజధానికి అనుసంధానంగా ఈ వారధిని రెండంతస్థులుగా నిర్మించడానికి ఆయన ఆసక్తి కనబరచారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు తుది డిజైన్లు సిద్ధమయ్యాయి.
ఇప్పటికే  పరిపాలనా నగర డిజైన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. కోహినూర్ వ‌జ్రాకారంలో అసెంబ్లీ, బౌద్ద స్తూపాకారంలో హైకోర్టును నిర్మించాల‌ని సీఎం నిర్ణయించారు. 40 ల‌క్షల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ప‌ది అంత‌స్థుల‌తో  స‌చివాయ‌లం రాబోతోంది. ఇదే కాంపౌండ్ లో శాఖాధిప‌తుల కార్యాల‌యాలు కట్టనున్నారు. డిజైన్లు కొలిక్కి రావడంతో నిర్మాణ పనులకు ముహుర్తం కూడా ఖ‌రారు చేసారు. ఆగ‌స్ట్ 15నాటికి అసెంబ్లీ కాన్సెప్ట్ ప్లాన్ సిద్దం అవుతుండటంతో  వెంట‌నే టెండ‌ర్లు పిలిచి విజ‌య‌ద‌శ‌మి రోజు నిర్మాణాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. హైకోర్టు  ప్లాన్ సెప్టెంబ‌ర్ 15కు వస్తున్నందున అక్టోబ‌ర్ 15 నుంచి పనులు మొదలుపెట్టనున్నారు. న‌వంబ‌ర్ మొద‌టిక‌ల్లా సచివాలయ నిర్మాణం ప్రారంభించేలా ప్లాన్ చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com