అర్మేనియా డైరీ పార్ట్ – 2
- July 22, 2017ఇలా మేరీ అన్ని విషయాలు చెప్తుండగానే మా బస్సు నగరం మధ్యలో ఉన్న యెరవాన్ రైల్వే స్టేషన్ కి చేరుకుంది. అర్మేనియా రైల్వే వ్యవస్థ పెద్దగా అభివృద్ధి చెందలేదు. కారణం మిగతా దేశాలతో పోలిస్తే అర్మేనియా లో రైలు వినియోగించేవారు తక్కువ. కేవలం స్థానికంగా రెండు మూడు ప్రాంతాలకి మాత్రమే రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక అంతర్జాతీయ కనెక్టివిటీ చూస్తే, పక్క నున్న టర్కీ , అజర్ బైజాన్ దేశాలతో ఉన్న వివాదాల వల్ల అంతర్జాతీయ రైల్వే వ్యవస్థ కూడా అభివృద్ధి కాలేదు 1993 నుండి టర్కీ , అజర్ బైజాన్ బోర్డర్లు మూసివేయటంతో ఆ రైల్వే లైన్ వినియోగంలో లేదు. కేవలం జార్జియా కి మాత్రమే ఒక రైలు ఉంది.ఆ రైల్వే స్టేషన్ ముందు ఫోటో తీసుకున్నాం.
అక్కడినుండి మా బస్సు రిపబ్లిక్ స్క్వేర్ కి చేరుకుంది.ఇది నగర కూడలి, అప్పటికే సాయంకాలం అవ్వటంతో కూడలి అంతా సందడిగా ఉంది. ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండటంతో అందరూ స్వేట్టర్లు తో కనిపించారు.ఈ కూడలి నిర్మాణం 1926 లో ప్రారంభమై 1977 వరకు నిర్మాణం కొనసాగింది. 1924 లో అలెగ్జాండర్ తామనియాన్ అనే వ్యక్తి ఈ కూడలికి రూపకల్పన చేశాడు.ఈ కూడలి మధ్యలో ఒక ఫౌంటెన్ మరియు చుట్టూ 5 భవనాల నిర్మాణం జరిగింది. ఈ భవనాలన్నీ కూడా అర్మేనియా సంస్కృతికి అనుగుణంగా నిర్మించారు. ఒక ప్రభుత్వ భవనం , చారిత్రక మ్యూజియం ,విదేశాంగ శాఖా కార్యాలయం, మారియట్ హోటల్ మరియు నేషనల్ గేలరీ భవనం ఉన్నాయి. 1950 నాటికి నాలుగు భవనాలు పూర్తవగా నేషనల్ గేలరీ మాత్రం 1977 లో పూర్తయ్యింది. మొదట్లో దీనిని లెనిన్ స్క్వేర్ అని పిలిచేవారట. ఇక్కడ లెనిన్ విగ్రహం కూడా ఉండేది. సోవియట్ నుండి అర్మేనియాకి స్వతంత్రం లభించాక , లెనిన్ విగ్రహాన్ని తొలగించి ఈ కూడలి పేరు కూడా మార్చారు. ఇక్కడ కార్లు, టాక్సీలు కూడా అన్నీ పాతవి మరియు చిన్న కార్లు. ఏదో అక్కడక్కడా తప్ప పెద్ద లగ్జరీ కార్లు కూడా కనపడలేదు.
ఈ విశేషాలన్నీ చూశాక అక్కడినుండి మా బస్సు విక్టరీ పార్క్ అనే ఉద్యానవనం వైపు బయలుదేరింది. రెండవ ప్రపంచ యుద్ధంలో అర్మేనియా దళాలు రష్యా తరపున యుద్ధంలో పాల్గొన్నాయి. 1945 లో ఆ యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా ఈ విక్టరీ పార్క్ ని నిర్మించారు. ఈ పార్క్ లో 22 మీటర్ల ఎత్తు ఉన్న "మదర్ ఆఫ్ అర్మేనియా" విగ్రహం ఉంది. గతంలో ఈ స్థానంలో రష్యా అధ్యక్షుడు స్టాలిన్ విగ్రహం ఉండేదట. 1953 లో స్టాలిన్ మరణించాక 1962 లో ఆయన విగ్రహాన్ని తీసేసి మదర్ ఆఫ్ అర్మేనియా విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు. పలు యుద్ధాల్లో భర్తలకు సహకరించిన అర్మేనియా మహిళల వీరత్వానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని నెలకొల్పారు.ఈ విగ్రహం కింద ఒక మ్యూజియం కూడా ఉంది. మొదటి , రెండవ ప్రపంచ యుద్ధాలతో పాటు అర్మేనియా పాల్గొన్న యుద్ధాలలో వీరమరణం పొందిన సైనికుల వివరాలు , ఆయుధాలు ఇక్కడ ఉంచారు. మేము వెళ్ళేటప్పటికి ఆలస్యం అవటంతో మ్యూజియం చూడలేకపోయాం. అప్పటికి చలిగాలులతో సన్నటి వర్షం మొదలైంది.
ఇక ఆరోజుకి మా పర్యటన ముగించుకుని నగరానికి కొంచెం దూరంలో ఉన్న కాస్కస్ అనే హోటల్ కి వెళ్లిపోయాం. ఇది నగరానికి కొంచెం దూరంగా ఉన్న 5 నక్షత్రాల హోటల్. మా గైడ్ మేరీ ఆ రోజుకి సెలవు తీసుకుని ఉదయం 9 గంటలకల్లా హోటల్ రెసెప్షన్ లో రెడీగా ఉండమని చెప్పింది. రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యాక హన్ష్ కి రూమ్ లోనే సెరిలాక్ తినిపించేసి ముగ్గురం కిందకి వచ్చాము. బయట వర్షం పడుతోంది , బాగా చలిగా ఉంది.ఈ హోటల్ కి రెండు రెస్టారెంట్లు ఉన్నాయి.ఒక దాంట్లో హెచ్చు స్థాయి సంగీతంతో పార్టీ జరుగుతోంది.మేము పక్కనే ఉన్న మరో రెస్టారెంట్ కి వెళ్ళాం.వెళ్ళగానే బేరర్ ఇచ్చిన మెనూ చూసి చాలా ఆశ్చర్యం వేసింది. ధరలన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ధరల్లో మన కర్రీ పాయింట్ లో రెండు కూరలు కూడా రావు. అలాంటిది ఫైవ్ స్టార్ హోటల్ లో చికెన్, మటన్ , చేపతో కూడిన పూర్తి భోజనం లభిస్తోంది.నేను బార్బిక్యూ చికెన్ ఆర్డర్ చెయ్యగా, భార్గవి లాంబ్ విత్ రైస్ ఆర్డర్ చేసింది. మాతో పాటు ఉన్న దుబాయ్ నుండి వచ్చిన మరో ఇద్దరు కూడా అదే రెస్టారెంట్ కి వచ్చారు.అందరం డిన్నర్ ముగించి రూమ్ కి వెళ్లిపోయాం.
మరుసటి రోజు ఉదయం 9 గంటలకల్లా హోటల్ ముందు మా గైడ్ మేరీ సిద్ధంగా ఉంది.అందరం అల్పాహారం ముగించుకుని బస్సు దగ్గరికి చేరుకున్నాం. హన్ష్ చిన్నవాడు కావటంతో అక్కడున్న అందరూ ముద్దు చేసేవారు. ముఖ్యంగా స్థానికులు వాడిని ఎత్తుకుని ఫొటోస్ తీసుకున్నారు. హోటల్ సిబ్బంది అక్కడున్న నాలుగు రోజులు వాడితో బాగా ఆడుకున్నారు. హన్ష్ కూడా ఎవరు ఎత్తుకున్నా అసలు మారాం చేసేవాడు కాదు.అందరి దగ్గరికీ వెళ్ళేవాడు.మేము అక్కడున్న నాలుగు రోజులు కూడా అసలు ఒక్క క్షణం కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వాడు కూడా ట్రిప్ ని ఎంజాయ్ చేసాడు.
ఇప్పుడు మేము వెళ్ళబోయేది లేక్ సెవాన్ అనే మంచినీటి సరస్సు. ఇది సముద్ర మట్టానికి 6250 అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలో రెండవ అతిపెద్ద మంచినీటి సరస్సు. మొదటిది లాటిన్ అమెరికాలోని టిటికాకా సరస్సు.ఇది బొలీవియాలో ఉంది. యెరవాన్ నుండి సెవాన్ 80 కిలోమీటర్లు. దాదాపు 2 గంటల ప్రయాణం. రోడ్లు మీద గుంతలు లాంటివి లేవు కానీ గొప్ప రోడ్లని కూడా చెప్పలేం. వాతావరణం బాగా చల్లగా ఉంది, ఉష్ణోగ్రత 10 డిగ్రీలు చూపిస్తోంది. మేము ప్రయాణించిన రెండు గంటల్లోనే వాతావరణంలో మార్పులన్నీ చూశాం. చలి , వర్షం , ఎండ అన్నీ రెండు గంటల్లో ఒకదాని తర్వాత మరోటి వచ్చాయి.ఇక్కడ వేసవి కాలం జూన్ నుండి సెప్టెంబరు మాసం వరకు ఉంటుంది.ఆ సమయంలో కూడా ఉష్ణోగ్రతలు 22-36 డిగ్రీల సెల్షియస్ మధ్యలోనే ఉంటాయి. మేము వెళ్ళింది మే నెల చివర్లో కనుక ఇంకా వాతావరణం పలు మార్పులకి లోనవుతుంది. మేము వెళ్లే దారి పొడవునా పచ్చటి కొండలు , లోయలు , అక్కడక్కడా మేత మేస్తున్న ఆవులు కనిపించాయి.సగం దూరం వెళ్ళాక రోడ్డుకి పక్కనే రైల్వే ట్రాక్ కనిపించింది. యెరవాన్ నుండి సెవాన్ కి రైల్ మార్గం ఉంది. ఇది మీటర్ గేజి కావటంతో చాలా చిన్న ట్రైన్ వెళ్తుంది. మా గైడ్ మేరీ చెప్తూ తాను చదువుకునే రోజుల్లో స్నేహితులతో కలిసి సరదాగా రైలు లోనే సెవాన్ కి వచ్చేవాళ్ళం అని చెప్పింది.మేము సెవాన్ సరస్సు చేరుకునేటప్పటికీ చలిగాలులు ఉదృతంగా వీస్తున్నాయి. మేము చలికి తగినట్లుగా సిద్ధపడి రావటంతో మా దగ్గర ఉన్న స్వేట్టర్లు , మంకీ కాప్ లు ధరించి కిందకి దిగాం. ఆ సరస్సు చాలా పెద్దది , ఈ గాలుల తాకిడికి సముద్రంలో వచ్చినట్లు సరస్సులో అలలు వస్తున్నాయి. మేము బస్సు దిగగానే గాలుల తాకిడి ఎక్కువవడంతో ఎదురుగా కొండపై ఉన్న ఒక రెస్టారెంట్ లోపలికి వెళ్లి కూర్చున్నాం. కాసేపటికి ఆ గాలుల ధాటికి రెస్టారెంట్ అద్దాలు భళ్ళున పగిలిపోయాయి. అదృష్టవశాత్తు ఆ అద్దాల దగ్గర ఎవరూ లేకపోవటంతో ఎవరికీ ఏమి కాలేదు.ఈ సరస్సు ఎదురుగా ఉన్న కొండపైనా ఒక పురాతన చర్చి ఉంది. అక్కడికి వెళ్తే సరస్సు మొత్తం కనిపిస్తుందట. ఆ గాలిలో మేము హన్ష్ ని తీసుకుని పైకి వెళ్లే సాహసం చేయలేకపోయాము. అక్కడే కాసేపు కూర్చుని కొంత గాలి తగ్గాక సరస్సు ముందు ఫోటోలు తీసుకున్నాం. ఒకప్పుడు 65 అడుగుల లోతు ఉన్న ఈ సరస్సు ఇప్పుడు 40 అడుగులకి తగ్గిపోయింది. చలికాలంలో ఈ సరస్సు గడ్డ కట్టిపోతుందట. అర్మేనియా కి అవసరమైన చేపలలో సింహభాగం ఈ సరస్సు నుండే వస్తాయట. అప్పటికే భోజన సమయం అవ్వటంతో సరస్సు ఒడ్డునే ఉన్న మరో రెస్టారెంట్ కి వెళ్ళాం. సెవన్ లో దొరికే అనేక రకాల చేపలలో సిగా అనేది అరుదైన చేప. మేము వెళ్లిన హోటల్ లో మాకు ఆరోజు అదే భోజనం. మా గైడ్ మేరీ ఈ చేప చాలా బావుంటుందని చెప్పటంతో ఎప్పుడూ అసలు చేప తినని భార్గవి కూడా మొదటిసారి ఆ చేపని రుచి చూసింది. నిజంగానే చేప అసలు వాసన లేకుండా చాలా రుచిగా ఉంది.
ఇక్కడి నుండి మేము వెళ్ళబోయేది గార్ని అనే పట్టణం.సెవన్ నుండి గార్ని 75 కిలోమీటర్లు, దారిలో అన్నీ చిన్న చిన్న గ్రామాల్ని దాటుకుంటూ దాదాపు గంటన్నర ప్రయాణం తరువాత గార్ని చేరుకున్నాం.గార్ని పట్టణం ఒకప్పటి అర్మేనియా రాజులకి వేసవి విడిది.అలాగే అక్కడ ఉన్న క్రీస్తు పూర్వం నాటి గార్ని దేవాలయం అర్మేనియాలో ముఖ్య సందర్శనీయ స్థలాల్లో ఒకటి.ఇది పాగన్ మతానికి చెందిన దేవాలయం. క్రైస్తవానికి పూర్వం అర్మేనియా లో పాగనిజం మరియు జోరాస్ట్రియన్ మతాలూ ఉండేవి. గార్ని దేవాలయం 2100 సంవత్సరాల నాటి నిర్మాణం.యునెస్కో వారసత్వ సంపదగా దీనిని గుర్తించింది. అర్మేనియాలో మిగతా ఏ సందర్శక ప్రాంతానికీ టికెట్ లేదు.ఈ ప్రాంతం చూడాలంటే మాత్రం 2 డాలర్లు రుసుము చెల్లించాలి. టికెట్ తీసుకుని లోపలి కొంత దూరం నడిచాక ఎదురుగా ఎత్తైన పర్వతాల మధ్యలో ఠీవిగా నిలబడ్డ నిర్మాణం కనిపించింది.మేము అందరికంటే ముందు వడి వడి గా ఆ నిర్మాణం లోపలికి చేరుకున్నాం. లోపల ఒక రాతి పీఠం మాత్రం ఉంది.అక్కడ ఒక వ్యక్తి సంగీతం వాయిస్తూ ఉన్నాడు. గైడ్ మేరీ దీని గురించి చెపుతూ ఈ నిర్మాణం చుట్టూ ఉండే 24 స్తంభాలు 24 గంటలని సూచిస్తాయట. అర్మేనియా లో గ్రీకు , రోమన్ శైలిలో నిర్మించబడిన ఏకైక నిర్మాణం ఇది. ఇది ఎప్పుడు కట్టారో సరిగ్గా ఎవరికీ తెలియదు. ఇక్కడ దొరికిన ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం 77 వ సంవత్సరంలో నిర్మించారని ఒక అంచనా.క్రైస్తవ మతానికి పూర్వం యూరోప్ దేశాల్లో పాగన్ మతం ఉండేది.ఈ మత విశ్వాసాల్ని గురించి ఎక్కడా ఖచ్చితమైన వివరాలు లేవు.ఇది విగ్రహారాధక మతం.యూరోపియన్ మరియు స్కాండినేవియన్ దేశాల్లో క్రైస్తవీకరణ ప్రారంభమయ్యాక క్రమక్రమంగా ఈ పాగనిజం క్షీణించింది. అర్మేనియాలో 3 వ శతాబ్దానికే క్రైస్తవ మతం ప్రవేశించడంతో మిగతా మతాలన్నీ కనుమరుగయ్యాయి. కొంతమంది చరిత్ర కారుల వాదన ప్రకారం ఈ నిర్మాణం దేవాలయం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే క్రైస్తవ మతం వచ్చాక ఇంతకుముందు ఉన్న మతాల గురుతులన్నీ చెరిపివేయబడ్డాయి. ఆ క్రమంలో పాగన్ మతానికి చెందిన దేవాలయాలన్నీ ధ్వంసం చేయబడ్డాయి. ఈ గార్ని దేవాలయం అనేది కేవలం సమాధి మాత్రమే అందువలనే దీనిని నాశనం చేయలేదు అని చెపుతారు. క్రైస్తవం వచ్చాక దీని పక్కనే దీనికన్నా ఎత్తైన చర్చి నిర్మాణం జరిగింది. అయితే ఆ 1679 లో వచ్చిన భూకంపం దాటికి చర్చి మొత్తం కూలిపోయింది. కాని గార్ని దేవాలయం మాత్రం పెద్దగా చెక్కు చెదరలేదు అక్కడక్కడా బీటలు వారింది.దీని పక్కనే కొద్దీ దూరంలో నేల మాళిగలో రోమన్ పవిత్ర స్నానానికి సంభందించిన గదులు ఉన్నాయి.
--రాజేష్ వేమూరి(దుబాయ్)
తాజా వార్తలు
- టీమిండియా ఆల్రౌండ్ షో….తొలి టీ20లో బంగ్లా చిత్తు
- TANA వైద్యశిబిరం విజయవంతం-550 మందికి చికిత్స
- Systematic Withdrawal Plan (SWP) ప్లాన్ లాభాల గురించి తెలుసా..?
- చెన్నై ఎయిర్ షో లో విషాదం
- గోవా రైల్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చ జెండా
- టీచర్లకు గోల్డెన్ వీసా..అక్టోబర్ 15 నుండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..!!
- రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్న పింక్ సైక్లిస్టులు..!!
- మహ్బూల్లాలో ఇంధన స్టేషన్..తీరిన ప్రయాణికుల కష్టాలు..!!
- సీబ్ ఫామ్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాప్రాయం..!!
- ఎమిరేట్స్ ఐడి లేకుంటే విమానాశ్రయాల్లో కష్టాలు..ప్రవాస భారతీయులకు అలెర్ట్..!!