రష్యాలో విశ్వంలో వేటకు శాటిలైట్‌ చిప్స్‌

- July 29, 2017 , by Maagulf
రష్యాలో విశ్వంలో వేటకు శాటిలైట్‌ చిప్స్‌

ఇటు నుంచి వీలు కాకపోతే.. అటునుంచి నరుక్కు రమ్మన్నారని సామెత. ఈ విశాల విశ్వంలో మనలాంటి బుద్ధిజీవులు ఇంకెవరైనా ఉన్నారా? అని దశాబ్దాలుగా వెతుకుతూ ఉన్నామా... రేడియో సంకేతాలను విశ్వాంతరాళాల్లోకి పంపుతున్నా సమాధానమైతే రాలేదు! ఇంత శ్రమ ఎందుకు? నేరుగా ఓ రాకెట్‌ను పంపేస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు గానీ.. దీంట్లో ఎన్నో  ఇబ్బందులున్నాయి. రాకెట్ల బరువు ఎంత ఎక్కువైతే.. ఖర్చు అంతే స్థాయిలో పెరిగిపోతుంది. పైగా వాటి వేగమూ తక్కువే. సౌరకుటుంబాన్ని దాటాలంటేనే ఏళ్లు పూళ్లవుతాయి. మరి తరుణోపాయం? బుల్లి శాటిలైట్లను ప్రయోగిస్తే సరి అంటున్నారు రష్యా వ్యాపారవేత్త యూరీ మిల్నర్‌. పక్క ఫొటోల్లో కనిపిస్తున్నవి మిల్నర్‌ ఆలోచనలకు ప్రతిరూపమైన నానో శాటిలైట్లే! పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు ఇవి ఉండేది కేవలం మూడున్నర సెంటీమీటర్ల పొడవు, వెడల్పు. కానీ ఇవి ఎంత దూరం వెళతాయో తెలుసుకుంటే మాత్రం ముక్కున వేలేసుకోక తప్పదు.
ఓ.. వీటి పేరు చెప్పనే లేదు కదూ.. స్టార్‌చిప్స్‌! త్వరలో ఇలాంటివి కొన్ని వేల సంఖ్యలో మనకు దాదాపు 40 లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆల్ఫా సెంటూరీ నక్షత్రం వరకూ వెళతాయి. అక్కడి నుంచి సమాచారం పంపుతాయి. ఇందుకు తగ్గట్టుగా వీటిల్లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. మరి అంత దూరం వెళ్లాలంటే ఎన్ని ఏళ్లు పడుతుంది? ఈ స్టార్‌చిప్స్‌ను లేజర్‌ కిరణాల సాయంతో కాంతివేగంలో 20 శాతం స్పీడ్‌ను అందుకునేలా చేస్తారు కాబట్టి 20 ఏళ్లలోనే అక్కడికి చేరుకోగలవు. స్టార్‌చిప్స్‌ కొన్నింటిని ఇప్పటికే భూ దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టారు. న్యూయార్క్, కాలిఫోర్నియాలోని కేంద్రాల నుంచి సమాచారం అందుకుంటున్నారు కూడా. మరిన్ని ప్రయోగాల తరువాత అల్ఫా సెంటూరి ప్రయాణం మొదలు కానుంది. అక్కడి నుంచి నేరుగా ఫొటోలు పంపే సామర్థ్యం ఉన్న స్టార్‌చిప్స్‌తో మన పొరుగున భూమిలాంటి గ్రహాలేవైనా ఉంటే స్పష్టమవుతుంది. ఇంకో విషయం.. ఈ ప్రాజెక్టును ఈ తరం ఐన్‌స్టైన్‌గా పేరు పొందిన స్టీఫెన్‌ హాకింగ్‌ లాంటి వారు మద్దతు పలుకుతున్నారు.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com