ఇకపై గ్యాస్‌పై ప్రతినెలా రూ.4 వడ్డింపు

- July 31, 2017 , by Maagulf
ఇకపై గ్యాస్‌పై ప్రతినెలా రూ.4 వడ్డింపు

లోక్‌సభలో కేంద్రం వెల్లడి
సబ్సిడీపై అందించే వంట గ్యాస్‌ (ఎల్‌పీజీ) సిలిండర్ల ధరలను ఇక నుంచి ప్రతి నెలా పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది. నెలకు రూ.4 చొప్పున పెంచాలని ఆయిల్‌ కంపెనీలను ఆదేశించినట్లు వెల్లడించింది. వచ్చే మార్చి కల్లా ఎల్‌పీజీపై అన్ని సబ్సిడీలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ‘14.2 కిలోల ఎల్‌పీజీ  సిలిండర్‌పై నెలకు రూ.2 చొప్పున (వ్యాట్‌ కాకుండా) పెంచాలని ఇండియన్‌ ఆయిల్, భారత్‌ పెట్రోలియం, హిందుస్తాన్‌ పెట్రోలియం  కంపెనీలను ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. ఆ ప్రకారం గతేడాది జూలై నుంచి ఎల్‌పీజీ సిలిండర్‌ ధర ప్రతినెలా రూ.2 పెరుగుతూ వస్తోంది.
ఇప్పుడు ఆ పెంపు మొత్తాన్ని ప్రభుత్వం రూ.4కు పెంచింది. జూన్‌ 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. సబ్సిడీని పూర్తిగా తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. సబ్సిడీ పూర్తిగా తొలగిపోయే వరకు లేదా మార్చి 2018 వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గ్యాస్‌ సిలిండర్లపై ప్రతినెలా రూ.4 పెంపు కొనసాగుతుందని ప్రధాన్‌ స్పష్టం చేశారు. ఇతర సబ్సిడీ సిలిండర్ల (5 కిలోల) ధర పెంపును ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నిర్ణయిస్తాయన్నారు.
ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్‌ ధర ప్రస్తుతం రూ.477.46 గా ఉంది. అదే గతేడాది జూన్‌లో రూ.419.18గా ఉంది. దేశవ్యాప్తంగా సబ్సిడీ గ్యాస్‌ పొందుతున్న వినియోగదారులు 18.11 కోట్ల మందికిపైగా ఉన్నారు. అందులో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గత ఏడాది కాలంగా కనెక్షన్లు పొందిన 2.5 కోట్ల మంది మహిళలు కూడా ఉన్నారు. వీరుకాక మరో 2.66 కోట్ల మంది సబ్సిడీయేతర గ్యాస్‌ వినియోగదారులు ఉన్నారు. మరోవైపు కేంద్రం నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com