చైనాలోని జింజియాంగ్‌ ప్రాంతంలో భారీ భూకంపం: 13 మంది మృతి

- August 09, 2017 , by Maagulf
చైనాలోని జింజియాంగ్‌ ప్రాంతంలో భారీ భూకంపం: 13 మంది మృతి

చైనాలోని జింజియాంగ్‌ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంపలేఖనిపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. చైనా సరిహద్దు దేశమైన కజకిస్థాన్‌లో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి సుచువాన్‌ ప్రాంతంలో 7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో సుమారు 13 మందికి మృతి చెందినట్లు భావిస్తున్నారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైనా మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రకృతి అందాల్లో బందీలుగా వందలమంది..
ప్రకృతి అందాలకు సిచువాన్‌ ప్రావిన్స్‌ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వివిధ వర్ణాల్లో కనువిందు చేసే సరస్సు అందాలను వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలి వస్తుంటారు. భూకంపం సంభవించినప్పుడు ఈ ప్రాంతంలో 38,000 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం.
మరోపక్క విద్యుత్‌ లేకపోవడంతో ఆ ప్రాంతమంతా చీకటిగా మారిందని ప్రత్యక్షసాక్ష్యులు పేర్కొన్నారు. 600 మంది అగ్నిమాపక సిబ్బంది, సైనికులు ఘటనాస్థలాలకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. అదీకాకుండా ఇటీవల చైనాలో భారీ వర్షాలు కురిసి సిచువాన్‌ ప్రావిన్స్‌లోని చెంగ్డూ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
2008లో ఇక్కడే 70,000 మంది బలి.. 
సిచువాన్‌ ప్రాంతంలో 2008లో 8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విపత్తులో దాదాపు 70,000 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన భూకంపాల్లో ఒకటిగా దీనిని భావిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com