చిత్తు చిత్తుగా ఓడిన లంక
- August 31, 2017
కొలంబో: కోహ్లీ సేనకు ఘన విజయం. శ్రీలంకకు మరో ఘోర పరాభవం. కొలంబో వేదికగా ఏకపక్షంగా సాగిన నాలుగో వన్డేలో ఆతిథ్య జట్టుకు అతిపెద్ద అవమానం. సొంతగడ్డపై తొలిసారి 168 పరుగులు తేడాతో ఓడి లంక జట్టు చెత్త రికార్డు సృష్టించింది. పరుగుల పరంగా స్వదేశంలో లంకకు ఇదే అతిపెద్ద పరాజయం. టెస్టు సిరీస్‌ను 3-0తో వూడ్చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌నూ 5-0తో క్లీన్ స్వీప్ చేసేందుకు అడుగు దూరంలో నిలిచింది. తన జైత్రయాత్రలో మరో చిరస్మరణీయ విజయం అందుకొంది. టాస్ గెలిచిన భారత్.. కోహ్లీ (131; 96 బంతుల్లో 17×4, 2×6), రోహిత్ శర్మ (104; 88 బంతుల్లో 11×4, 3×6) శతకాలు చేయడంతో 375/5తో నిలిచింది. ఛేదనకు దిగిన శ్రీలంక.. బుమ్రా, పాండ్యా, కుల్దీప్ తలో రెండు వికెట్లతో చెలరేగడంతో 207 పరుగులకే కుప్పకూలింది. ఏంజెలో మాథ్యూస్ (70; 80 బంతుల్లో 10×4) ఒక్కడే పోరాడాడు. సిరివర్దన (39) ఫర్వాలేదనిపించాడు.
టాస్ గెలిచిన కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.అతడు 16 సార్లు టాస్ గెలవగా మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం ఇది రెండోసారి. తొలిసారి కూడా శ్రీలంకపైనే. ఆరు పరుగుల వద్దే ఓపెనర్ శిఖర్ ధావన్ (4) వికెట్ చేజార్చుకున్న భారత్.. భారీ స్కోరు చేయగలదా అని సందేహించారు. దాన్ని పటాపంచలు చేస్తూ సారథి కోహ్లీ (131; 96 బంతుల్లో 17×4, 2×6), ఓపెనర్ రోహిత్ శర్మ (104; 88 బంతుల్లో 11×4, 3×6) శతకాలతో అదరగొట్టారు.
విరాట్ తన కళాత్మక బ్యాటింగ్‌ను మరోసారి ప్రదర్శించాడు. వరుస బౌండరీలతో 38 బంతుల్లో అర్ధశతకం చేసిన అతడు 76 బంతుల్లోనే శతకం సాధించాడు. వన్డేల్లో సచిన్ 49, రికీ పాంటింగ్ 30 తర్వాత 29 సెంచరీలతో మూడో స్థానంలో నిలిచాడు. రేపో..మాపో పాంటింగ్‌ను దాటేయడం ఖాయం! ఇక లంకపై 44 ఇన్నింగ్సుల్లోనే 2000 పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు విరాట్. మరోవైపు రోహిత్ సిరీస్‌లో వరుసగా రెండో శతకం బాదాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 168 బంతుల్లో 219 పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీ 200+ భాగస్వామ్యం చేయడం ఇది మూడోసారి. 150+ చేయడం ఎనిమిదో సారి. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని 29.3వ బంతికి కోహ్లీని ఔట్ చేయడం ద్వారా మలింగ విడదీశాడు. అప్పుడు జట్టు స్కోరు 225. మలింగకు ఇది 300వ వికెట్ కావడం ప్రత్యేకం.
కోహ్లీ నిష్క్రమణ తర్వాత హార్దిక్ పాండ్యా (19) రావడంతో స్కోరు 400 దాటుతుందని అంచనా వేశారు. జట్టు స్కోరు 262 వద్ద పాండ్యా, రోహిత్.. మాథ్యూస్ వేసిన 35వ ఓవర్లో పెవిలియన్ చేరారు. స్ట్రోక్ ప్లేయర్ లోకేశ్ రాహుల్ (7) మరోసారి తక్కువ పరుగులకే జట్టు స్కోరు 274 వద్ద ఔటై నిరుత్సాహపరచడంతో స్కోరు వేగం తగ్గింది. ఈ దశలో వచ్చిన మనీశ్ పాండే (50 నాటౌట్; 42 బంతుల్లో 5×4, 1×6), ఎంఎస్ ధోనీ (49 నాటౌట్; 42 బంతుల్లో 5×4, 1×6) తొలుత ఆచితూచి ఆడి చివర్లో జోరు పెంచారు. చక్కని బౌండరీలు బాది స్కోరు వేగం పెంచారు. ఆరో వికెట్‌కు 101 పరుగులు ఆజేయ భాగస్వామ్యం అందించడంతో భారత్ 375/5తో నిలిచింది. ధోనీకి ఇది 300 వన్డే. కాగా పాండే జట్టులో చోటు కోల్పోయి చాన్నాళ్లైన తర్వాత వచ్చాడు. అందుకే అతడు పరుగులు చేయడం అవసరం.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









