2019 ఎన్నికల కోసం మోడీ, అమిత్ షా పదునైన వ్యూహం

- September 24, 2017 , by Maagulf
2019 ఎన్నికల కోసం మోడీ, అమిత్ షా పదునైన వ్యూహం

కమలనాధుల మిషన్ మొదలైంది. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ కార్యవర్గ సమావేశంలో 2019 ఎన్నికల కార్యాచరణ సిద్ధమవుతోంది. పార్టీ బలోపేతంపై రాష్ట్రాల నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా.  ఆర్థిక, రాజకీయ భవిష్యత్తు ఎజెండాను ఇవాళ మోడీ ప్రకటించనున్నారు. విపక్షాల విమర్శలకు కౌంటరివ్వనున్నారు.

దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వ్యూహాలు రచిస్తున్నారు. త్వరలో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న సమావేశాల్లో తొలిరోజు..మూడేండ్లలో పార్టీ పురోగతిని సమీక్షించారు అమిత్ షా. ఇటీవలే 24 రాష్ట్రాల్లో పర్యటించిన బీజేపీ చీఫ్..ఒక్కో రాష్ట్ర ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై అక్కడి రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. సోమవారం ప్రవేశ పెట్టనున్న తీర్మానాలకు తుదిరూపునిచ్చారు అమిత్ షా. పార్టీ వ్యవహారాలపై అమిత్‌షాకు ఉన్న పట్టును చూసి... రాష్ట్రాల నాయకులు విస్తుపోయారు. రాష్ట్రాలకు సంబంధించిన  చిన్న చిన్న విషయాలు సైతం అడిగారని తెలిపారు

ఇక ఇవాళ్టి సమావేశానికి ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ప్రభుత్వ ఆర్థిక, రాజకీయ భవిష్యత్తు ఎజెండాను ఆయన ప్రకటించనున్నారు. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2 శాతం పడిపోవడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో...ఆర్థిక రంగం, జీఎస్టీపై ప్రధాని సమాధానం ఇచ్చే అవకాశాలున్నాయి.రోహింగ్యాలతోపాటు ఇతర అంశాలపై కూడా ఆయన క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ  గుప్పిస్తున్న విమర్శలకు మోడీ కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది.

ఢిల్లీలోని తాల్‌కటోరా స్టేడియంలో జరుగుతున్న బీజేపీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాలకు 1,400 మంది ఎమ్మెల్యేలు, 337 మంది ఎంపీలు సహా 2వేల మందికి పైగా ప్రజా ప్రతినిధులు, కీలక నేతలు హాజరయ్యారు. చివరి రోజు జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాలు విప్లవాత్మకమైనవంటూ  రెండు తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com