ముద్దయిన శిథిల భవనాలు, పొంచి ఉన్న ప్రమాదం
- October 02, 2017హైదరాబాద్ : నగరంలో వందలాదిగా శిథిల భవనాలున్నాయి. గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలతో అవన్నీ తడిసి నానిపోయాయి. ఎప్పుడు కూలిపోతాయో అన్నట్లుగా తయారయ్యాయి. గుట్టలపై ఏటవాలు ప్రాంతంలో నిర్మించుకున్న గుడిసెలు సైతం వర్షానికి నిలవలేకపోతున్నాయి. మెహిదీపట్నం, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్ బస్తీల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన బల్దియా యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తోంది. ప్రజలు మృత్యువాత పడుతున్నా వేర్వేరు కారణాలు చెబుతూ అధికారులు కాలం గడుపుతున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నంబరు 10లో సోమవారం కురిసిన వర్షానికి నాయుడునగర్ బస్తీలో గుట్టపై ఉన్న గుడిసె కుప్పకూలింది. ఎగువ నుంచి వచ్చిన వరదను తట్టుకోలేక గోడలు కూలాయి. అందులో ఉన్న యాదులు (30), నాలుగు నెలల పసికందు మృతి చెందారు. నగరంలో ఇటు వంటి గుడిసెలు వేలాదిగా ఉన్నాయి.
కోర్టు కేసులంటూ..
ఎంజే మార్కెట్ నుంచి అఫ్జల్‌గంజ్, చార్మినార్ వరకు వందలాది శిథిల భవనాలు ఉన్నాయి. వాటన్నింటిలో గత యాభై, ఆరవై సంవత్సారాల నుంచి వ్యాపారాలు నడుస్తున్నాయి. కొన్ని భవన సముదాయాల్లో తక్కువ అద్దె ఉండటంతో పేదలు నివాసముంటున్నారు. ఇంకొందరు పేదరికం వల్ల ఆయా భవనాలను ఖాళీ చేయలేక కోర్టు నుంచి స్టే తెచ్చుకుని కాలం గడుపుతున్నారు. కోర్టులో కౌంటర్ దాఖలు చేసి శిథిలభవనాలన్నిటినీ కూల్చేయాల్సిన బల్దియా నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది.
గతేడాది పది మరణాలు..
సెప్టెంబరు, 2016లో సికింద్రాబాద్ దగ్గర అర్ధరాత్రి ఓ శిథిల భవనం కూలి యజమాని అక్కడికక్కడే మరణించారు. ఆ ఇంటిని ఖాళీ చేయాలని ప్రమాదానికి ముందు రోజే సికింద్రాబాద్ సర్కిల్ అధికారులు అతనికి నోటీసులివ్వడం గమనార్హం. పైగా నోటీసులు తీసుకుంటూ ఆ యజమాని పలు వ్యాఖ్యలు చేశారని పట్టణ ప్రణాళిక విభాగం చెబుతోంది. ''నలభై ఏళ్లుగా దుకాణం నడిపిస్తున్నా. ఇంత వరకు ఏమీ కాలేదు. ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చే ప్రమాదం నాకు కనిపించట్లేదు. ఈ ఇంటి గురించి మీకన్నా నాకు బాగా తెలుసు. మీరు ఎన్ని చెప్పినా ఖాళీ చేసేదే లేదు'' అంటూ తమ ఆదేశాలను యజమాని బేఖాతరు చేసినట్లు అధికారులు వాపోయారు. ఇలా సుమారు పది మంది గతేడాది నిర్మాణ ప్రమాదాల్లో మృతి చెందారు.
శిథిల భవనాలు ఉన్న ప్రాంతాలు..
సికింద్రాబాద్, ఆబిడ్స్, పాతబస్తీ(చార్మినార్), మెహిదీపట్నం, కార్వాన్, ముషీరాబాద్, అంబర్పేట్, మలక్‌పేట్, కూకట్పల్లి, రాజేంద్రనగర్, ఖైరతాబాద్.. గతేడాది 2,010 శిథిల భవనాలున్నాయని చెప్పిన బల్దియా.. ప్రస్తుతం 650 నిర్మాణాలున్నట్లు స్పష్టం చేస్తోంది. గత ఐదు నెలల్లో మొత్తం 165 కూల్చామని, 15 ఇళ్లను ఖాళీ చేయించామని తెలిపారు.
భారీ వర్షానికి ధ్వంసమైన ఇల్లు
కేశవగిరి, న్యూస్‌టుడే: సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా బండ్లగూడ నూరీనగర్‌లో ఓ ఇల్లు ధ్వంసం అయ్యింది. అలీ కేఫ్ సమీపంలో ఉన్న ఓ ఇంటికి రెండు వైపుల ఉన్న గోడలు సోమవారం రాత్రి అకస్మాత్తుగా కూలిపోయాయి. అదృష్టవశాత్తూ ఇంట్లోవారు గాయపడలేదు. కానీ ఇంటిలోని వస్తువులు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక తెరాస నేతలు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. బండ్లగూడ మండల తహసీల్దారు వేణుగోపాల్, వీఆర్వో గణేశ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
బండ్లగూడలో అలుగుపారిన సూరం చెరువు
కేశవగిరి, న్యూస్‌టుడే: కుండపోత వర్షం నేపథ్యంలో చాంద్రాయణగుట్ట బండ్లగూడలోని సూరం చెరువు (నూరీషా తలాబ్) సోమవారం రాత్రి అలుగు పారింది. దీంతో చెరువు పక్కనే ఉన్న నూరీషా మదర్సాలోకి వరదనీరు పెద్దఎత్తున చేరింది. విషయం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ వై.ప్రకాష్‌రెడ్డి సిబ్బందిని అక్కడికి పంపారు. ఎస్సై ఎస్.కృష్ణయ్య సిబ్బందితో బస్తీలోకి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









