మెట్రో రైలును శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు పొడిగించేందుకు కెసిఆర్ అడుగులు
- October 04, 2017
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ, ఎయిర్ పోర్టు సిటీ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్పీసింగ్, జీఎంఆర్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి మల్లిఖార్జున్ రావుతో పాటు ఉన్నతాధికారులు, విమానాశ్రయ అధికారులు పాల్గొన్నారు. 2008లో ప్రారంభమైన విమానాశ్రయ పురోగతిని జీఎంఆర్ ప్రతినిధులు సీఎంకు వివరించారు. శంషాబాద్ విమానాశ్రయం అనతికాలంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని, ఐటీ వినియోగం సహా అనేక విషయాల్లో ముందంజలో ఉందని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 400 విమానాలు వచ్చిపోతున్నాయని, ఏడాదికి కోటీ 70 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందున్న వృద్ధి రేటు ప్రస్తుతం 20.4శాతానికి పెరిగిందని, మున్ముందు ఇంకా పెరుగుతుందని చెప్పారు. ఇపుడున్న టెర్మినల్, రన్ వే దాదాపు రెండున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనువుగా ఉందని... వృద్ధిరేటు అంచనా ప్రకారం టెర్మినల్ విస్తరణతో పాటు రెండో రన్ వే నిర్మాణం అవసరమవుతుందని జీఎంఆర్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రెండో రన్ వేను మూడేళ్లలో పూర్తి చేస్తామని, ఇందుకు ప్రభుత్వ సహకారం కావాలని జీఎంఆర్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు.
ఇక శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్ కు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని, వాతావరణ పరిస్థితులు, మెరుగైన శాంతిభద్రతల కారణంగా ఎన్నో అంతర్జాతీయ సదస్సులకు కూడా నగరం వేదిక అవుతోందన్నారు ముఖ్యమంత్రి. ఈ కారణాల వల్ల విమానాశ్రయంలో రద్దీ పెరుగుతోందని...రాబోయే 25 ఏళ్లకు ఏర్పడే రద్దీని కూడా అంచనా వేసుకుని టెర్మినల్ విస్తరించాలన్నారు. రెండో రన్ వే నిర్మాణం కూడా చేపట్టాలని సీఎం సూచించారు. ప్రపంచ స్థాయి సదస్సులు నిర్వహించుకునేలా 12 వేల మంది సామర్థ్యంతో సమావేశ మందిరం, అంతర్జాతీయ ప్రదర్శనల కోసం ఎగ్జిబిషన్ హాల్స్ నిర్మించాలని చెప్పారు. స్టార్ హోటళ్లు, మాల్స్, ఆసుపత్రులు, పార్క్‌లు, విశాలమైన పార్కింగ్ స్థలంతో కూడిన ఎయిర్ పోర్టు సిటీని 600 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా నిర్మించాలని కేసీఆర్ సూచించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా ఎయిర్ పోర్టు సిటీ ఉండాలని... త్వరలో తానే వచ్చి శంకుస్థాపన చేస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. విమానాశ్రయ పదేళ్ల వేడుకలో కూడా పాల్గొంటానన్నారు. విస్తరణ పనుల నేపథ్యంలో ప్రభుత్వ పరంగా కూడా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్న సీఎం... అక్కడి వరకూ రహదార్ల నిర్మాణం - విస్తరణ, విద్యుత్ సరఫరా, మంచినీటి సౌకర్యం, పారిశుధ్యం, డ్రైనేజీ పనులు చేపట్టాలని తెలిపారు. మెట్రో రైలును విమానాశ్రయం వరకు పొడిగించాలన్న కేసీఆర్... ఆ సదుపాయం ఉంటే ఢిల్లీ తరహాలో రైలులోనే విమానాశ్రయం చేరుకోవడానికి ప్రయాణీకులు ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. మెట్రో రైల్ ను విమానాశ్రయం వరకు విస్తరించే పనులు వెంటనే ప్రారంభించేలా త్వరలోనే జీఎంఆర్, ఎల్ అండ్ టీ, హెచ్ఎంఆర్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







