ఎల్బీ స్టేడియంలో పోలీస్ శాఖకు చెందిన ఎక్స్‌పో

- October 14, 2017 , by Maagulf
ఎల్బీ స్టేడియంలో పోలీస్ శాఖకు చెందిన ఎక్స్‌పో

తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఎక్స్‌పో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కనువిందు చేస్తోంది. పోలీసుల సంస్మరణ దినం నేపథ్యంలో ఎక్స్‌పోను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ, సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ప్రతీ ఏటా 21న జరుపుకునే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో వారి త్యాగాలను గుర్తుచేసుకుంటున్నారు. అందులో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలీస్ ఎక్స్‌పోను హోంమంత్రి నాయిని నర్సింహ్మా రెడ్డి ప్రారంభించారు.
డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, షీ టీమ్స్, సైబర్ క్రైమ్‌తోపాటు 21 విభాగాల స్టాల్స్‌ను ప్రదర్శనలో ఉంచారు. ఎక్స్‌పో ప్రారంభంలో ట్రైనింగ్ లో ఉన్న ఫస్ట్ బెటాలియన్, 8వ బెటాలియన్ కానిస్టేబుళ్లు చేసిన కవాతు అందరినీ ఆకట్టుకుంది. దీంతో పాటు సైబరాబాద్ టాకిటాల్ టీమ్ చేసిన విన్యాసాలు, ఆత్మరక్షణతోపాటు.. క్రిమినల్స్‌ని ఎలా పట్టుకుంటారో అనేదానిపై డెమో నిర్వహించారు. వివిధ రకాల ఆయుధాలతో చేపట్టిన ఎగ్జిబిషన్‌ నగరవాసులను అమితంగా ఆకట్టుకుంది. చిన్న చిన్న పిస్టల్స్‌ దగ్గర్నుంచి మెషీన్‌ గన్ల వరకు అన్ని రకాల ఆయుధాలు ప్రదర్శనకు ఉంచారు. సెక్యూరిటీ సిస్టమ్స్‌, సీక్రెట్‌ కెమెరా వ్యవస్థలతోపాటు రాకెట్‌ లాంచర్లు, రకరకాల మెషీన్‌ గన్లు ఎలా పనిచేస్తాయో వివరించారు. సీఆర్పీఎఫ్‌ ఉపయోగించే అధునాతన ఆయుధాలు కూడా ప్రదర్శనలో ఉంచారు. అంతకు ముందుకు ఎక్స్‌పో ప్రారంభించిన హోంమంత్రి స్టాల్స్‌ను సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతీ సంవత్సరం జరుపుకునే సంస్మరణ దినోత్సవంతో పోలీస్ సేవలు ప్రజల్లోకి వెళతాయన్నారు. మూడు రోజుల పాటు ఎక్స్‌పో జరుగుతుంది. ఎక్స్‌పో జరిగే అన్ని రోజులు నగరవాసులకు అనుమతినిస్తారు పోలీసులు. దీంతోపాటు రేపు 2కే, 5కే, 10కే రన్‌లను ఏర్పాటు చేయనున్నారు పోలీసులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com