ఉగ్రవాది హఫీజ్ సయీద్ రాజకీయనేతై...
- October 18, 2017
మసిపూసి మారేడుకాయ చేయడంలో పాకిస్థాన్‌ను మించిన దేశంలేదు. ప్రపంచమంతా ఉగ్రవాదులని ఈసడించుకునే వారికి రాజకీయ నాయకుల ముసుగు వేయాలని చూస్తోంది.. అదే సమయంలో ప్రపంచమంతా గౌరవించే పొరుగు దేశాల నేతలకు ఉగ్రవాదుల ముసుగు వేయాలని ప్రయత్నిస్తోంది. అక్కడ ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా ఉందో చూస్తే ఎవరైనా కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. తాజాగా ఉగ్రవాదులను పార్లమెంట్‌లోకి తీసుకొచ్చి వారికి చట్టబద్ధత, రక్షణ కల్పించాలని భావిస్తోంది. పాక్‌లో సంప్రదాయ రాజకీయ పార్టీల నేతలు ఎవరూ సైన్యానికి ఎదురు చెప్పి బతికి బట్టకట్టలేదు. ప్రస్తుతం ఉగ్రవాదులను ఆ దేశ పార్లమెంట్‌కు ఎగుమతి చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే సైన్యం కార్యాచరణలోకి దిగి అనుబంధ సంస్థలతో మాట్లాడి వారికి మార్గం సుగమం చేస్తోంది. ఈ విషయాన్ని పాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ స్టడీస్ విశ్లేషకుడు మహమూద్ అమీర్ రానా తెలిపారు. తాజాగా 'లష్కరే తోయిబా', 'జమాత్ ఉద్ దవా' అధినేత హఫీజ్ సయీద్‌ను కూడా పార్లమెంట్‌కు చేర్చేందుకు రంగం సిద్ధమవుతోంది. హఫీజ్ ఏకలవ్య శిష్యులంతా పోగై ఇప్పటికే 'మిల్లి ముస్లిం లీగ్'(ఎంఎంఎల్) పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. దీని అధ్యక్షుడు సైఫుల్లా ఖలీద్.
ఇతను జామత్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు. ఎంఎంఎల్ తొలిసారి లాహోర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని కూడా బరిలోకి దించింది. సదరు అభ్యర్థి ఎవరో కాదు.. 2012లో అమెరికా ట్రెజరీ ఉగ్రవాద జాబితాలో స్థానం సాధించిన ప్రఖ్యాత యాకూబ్ షేక్..!
వీరి ఎన్నికల ప్రచారం కోసం లాహోర్ మొత్తాన్ని సయీద్ ఫొటోలు, బ్యానర్లు, పోస్టర్లతో నింపేశారు. ఇదే స్థానానికి పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా పోటీచేయడం విశేషం. అప్పట్లో ఎంఎంఎల్ అభ్యర్థికి ఐదుశాతం ఓట్లు కూడా వచ్చాయి. ఇదే ఎన్నికల్లో ఆరుశాతం ఓట్లు పొందిన ఇస్లామిస్ట్ పార్టీ అభ్యర్థిపై ఓ ఎంపీని హత్యచేసిన కేసు ఉంది.
దేశంలో దైవదూషణకు కఠిన శిక్షలు విధించాలనే నినాదంతో సదరు అభ్యర్థి ప్రచారం చేశారు. సున్ని ఉగ్రసంస్థ అయిన లష్కరే జంగ్వీ అధినేత కుమారుడు మస్రూర్ నవాజ్ జంగ్వీ ఇటీవలే పంజాబ్ నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాడు. అప్పట్లో ఇది సంచలనం రేపింది. పాక్ విచిత్ర వాదన..
ఉగ్రవాదులు ప్రజాస్వామ్య వ్యవస్థలోకి చొచ్చుకు రావడాన్ని ఎవరైనా విమర్శిస్తే పాక్ విచిత్రమైన వాదన లేవనెత్తుతోంది. ఐర్లాండ్‌లో ఐఆర్ఏ గ్రూప్, ఇండోనేషియాలో ఇస్లామిస్ట్ రాడికల్స్ రాజకీయల్లోకి వచ్చి ఉగ్రవాదాన్ని వీడిన విషయాన్ని గుర్తుచేస్తోంది. అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని చెబుతోంది. యుద్ధంలో పూర్తిగా చితికిపోయిన అఫ్గానిస్థాన్‌తో పాక్ పోల్చుకోవడం విడ్డూరంగా ఉంది.
హఫీజ్ లక్ష్యం ఎప్పుడూ భారతే పాక్‌లో పుట్టగొడుగుల్లా ఉగ్రసంస్థలు ఉన్నాయి. కానీ ఐఎస్ఐ హఫీజ్ సయీద్‌నే చేరదీయడానికి కారణం ఉంది. మిగిలిన ఉగ్రసంస్థల్లా లష్కరే తోయిబా పాక్‌లో ఎప్పుడూ దాడులు చేయలేదు. దీనికి తోడు ఈ సంస్థ సభ్యులు పాక్ సైన్యాన్ని సమన్వయం చేసుకుంటూ భారత్‌పై పరోక్ష యుద్ధానికి దిగారు.
దీంతో ఐఎస్ఐ లష్కరే తోయిబాకు ఆర్థిక, సైనిక, నైతిక మద్దతునిస్తుంటుంది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. ముంబయి దాడుల కుట్రదారుల్లో ఒకరైన డేవిడ్ హేడ్లీ. హఫీజ్‌ను అదుపు చేయమని ఇప్పుడు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగిపోవడంతో అతడిని ఒక రాజకీయ నేతగా చూపేందుకు ఐఎస్ఐ కొత్త ఎత్తుగడ వేసింది.
దానికి వాస్తవిక రూపమే మిల్లీ ముస్లిం లీగ్. దీంతో పాటు హఫీజ్ గృహనిర్బంధం నుంచి విడుదల చేసేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ నెల 24తో హఫీజ్ గృహనిర్బంధం గడువు ముగియనుంది. దీనిని పొడిగించాలనే ప్రతిపాదనను పాక్ ప్రభుత్వం విరమించుకుంది.
కానీ అమెరికా నుంచి ఒత్తిడి పెరగటంతో హఫీజ్ గృహనిర్బంధాన్ని పొడిగించాలని పంజాబ్ జ్యుడీషియల్ రివ్యూ బోర్డును కోరింది. తొండ ముదిరి వూసరవెల్లి.. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా ఇన్నాళ్లూ పాక్‌కు వేల మిలియన్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించింది. కానీ అసలు ఉగ్రమూలాలు పాక్‌లో ఉన్న విషయం ఇప్పుడిప్పుడే అమెరికాకు తెలుస్తోంది.
దీనిలో భాగంగానే ఇటీవల పాక్‌ను దూరంపెడుతూ వస్తోంది. అన్ని ఉగ్రసంస్థలకు మాతృక వంటి ఐఎస్ఐ ఏకంగా సొంత విదేశాంగ విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విషయాన్ని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ జేమ్స్ మాటీస్ స్వయంగా తెలిపారు. పాక్ ఐఎస్ఐ గురించి అమెరికా నేరుగా ప్రస్తావించడం ఇదే తొలిసారేమో..!
విస్తుపోయిన అమెరికా ఐఎస్ఐ పేరును నేరుగా అమెరికా ప్రస్తావించడంతో పాక్‌కి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. దీంతో అసలు దీనంతటికి కారణం అమెరికానే అంటూ ఎదురుదాడికి దిగింది. ఇరవై, ముప్పై ఏళ్ల క్రితం హక్కానీలు, హఫీజ్ సయీద్‌లు వైట్‌హౌస్‌తో అంటకాగిన వారేనని.. ఇప్పడు వారిని పెంచి పోషించిన నెపం పాక్‌పై వేస్తున్నారని నంగనాచి మాటలు మాట్లాడింది.
ఐఎస్ఐకు తెలియకుండా వారు వైట్‌హౌస్ వరకు వెళ్లలేరు అనే విషయం సదరు ప్రకటన చేసిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఖ్వాజీ ఆసీఫ్‌కు తెలియనట్లుంది.
తాజా వార్తలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









