త్వరలో ఓలా, ఉబెర్‌ సర్వీసుల్లా అద్దెకు ఎయిర్‌క్రాఫ్ట్‌.!

- October 19, 2017 , by Maagulf
త్వరలో ఓలా, ఉబెర్‌ సర్వీసుల్లా అద్దెకు ఎయిర్‌క్రాఫ్ట్‌.!

నగరంలో మనం ఎక్కడికైనా వెళ్లాంటే ఓలా, ఉబెర్‌ వంటి క్యాబ్‌ సర్వీసులను బుక్‌ చేసుకుని గమ్య స్థానాలకు చేరుతున్నాం. ఎంత కారులో వెళ్లినా, ట్రాఫిక్‌ నుంచి మాత్రం తప్పించుకోలేం. అంతేకాదు లాంగ్‌ ట్రిప్‌లకు వెళ్లాలన్నా, ఈ సంస్థలు కార్లను అద్దెకు ఇస్తున్నాయి. ఇలా విమానాలను కూడా అద్దెకు ఇస్తే భలే ఉంటుంది కదా! ఇప్పటికే భారత ప్రభుత్వం విమాన సర్వీసులను అందరికీ అందుబాటులోకి తేచ్చేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగానే 'ఉడాన్‌' పేరుతో ప్రాంతీయ అనుసంధాన పథకాన్ని తీసుకొచ్చింది. త్వరలోనే ఓలా, ఉబెర్‌ సర్వీసుల్లా ఎయిర్‌క్రాఫ్ట్‌లను అద్దెకు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అదీ ప్రస్తుతం వసూలు చేస్తున్న ధరలకు సగానికి సగం తగ్గించి ఎయిర్‌క్రాఫ్ట్‌లను అద్దెకు ఇవ్వనుంది. ప్రస్తుతం దేశంలో 129 జనరల్‌ ఏవియేషన్‌ నిర్వాహకులు ఉన్నారు. ఇందులో 60మందికి సొంత ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. మిగిలిన వారు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఒకే విభాగం కిందకు తీసుకురానున్నారు.

ప్రస్తుతం ఎవరైనా ఎయిర్‌క్రాఫ్ట్‌ను వినియోగించుకుంటే అద్దె, ప్రయాణ దూరం, ఖాళీ తిరిగి వచ్చినందుకు ఇలా అన్నింటికీ కలుపుకొని రుసుములు వసూలు చేస్తున్నారు. అయితే కొత్త విధానంలో 50శాతం వరకూ ధరలు తగ్గే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా డిమాండ్‌, సప్లయ్‌ ఆధారంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడపనున్నారు. దీని ద్వారా మొత్తంగా సమయం తగ్గడం, వినియోగదారులకు ధరలు తగ్గడం జరుగుతుందని దిల్లీ వేదిక కార్యకలాపాలు నిర్వహించే చార్టర్‌ కంపెనీ జెట్‌ సెట్‌ గో సహ వ్యవస్థాపకుడు కనికా టెక్రివాల్‌ పేర్కొన్నారు.

క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ ఇందులో భాగస్వామి. ప్రస్తుతం ధరలు వేటికవే భిన్నంగా ఉన్నాయని, ఒక విధంగా చూస్తే 50శాతం ఎక్కువగానే ఉన్నాయని టెక్రివాల్‌ అన్నారు. ప్రస్తుతం ఆరు నుంచి తొమ్మిది సీట్ల సామర్థ్యం కలిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను అద్దెకు తీసుకుంటే గంటకు రూ.1,50,000 నుంచి రూ. 2,00,000 వరకూ వసూలు చేస్తున్నారు.

దేశంలో చార్టర్‌ విమానాల వ్యాపారం మరింత వృద్ధి చెందనుందని ఎయిర్‌ సహారా మాజీ అధ్యక్షుడు అలోక్‌ శర్మ అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి త్వరలోనే హాలిడే ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రయాణీకుల సౌకర్యం, హోటళ్లు, వివిధ బృందాలకు విమాన ప్రయాణాన్ని దగ్గర చేస్తామన్నారు. చార్టర్‌ విమానాల్లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని, వ్యాపారాభివృద్ధికి చాలా అవకాశం ఉందని శర్మ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com