యనమలకు రాజ్యసభ సీట్... ఏపీకి కొత్త ఆర్థిక మంత్రి..!

- October 20, 2017 , by Maagulf
యనమలకు రాజ్యసభ సీట్... ఏపీకి కొత్త ఆర్థిక మంత్రి..!

బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు కావడం అనేది రాజకీయాల్లోనే ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న నేతలకు పదవులు ఎప్పుడు ఊడతాయో? ఎప్పుడు అందలాలు ఎక్కుతారో? చెప్పడం కష్టం. ప్రస్తుతం ఏపీ అధికార పార్టీలోనూ పరిస్థితి ఇలానే ఉందట. చంద్రబాబుకు అన్ని విధాలా రైట్ హ్యాండ్ అనదగిన ఆర్థిక మంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రభుత్వంలో తెల్ల ఏనుగును తలపిస్తున్నారట. ఆయన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని బాబు డిసైడ్ అయ్యారట. దీంతో త్వరలోనే ఆయనను అతి పెద్ద పోస్టు నుంచి తప్పించి అసలు ఏపీలోనే లేకుండా చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
విషయంలోకి వెళ్తే.. ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. సీఎం నుంచి ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట. దీనిని అదుపులో పెట్టేందుకు కానీ, విభజన చట్టం మేరకు కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కానీ, ఓ ఆర్థిక మంత్రిగా యనమల చేసిన, చేస్తున్న ప్రయత్నం బాబుకు ఎక్కడా కనిపించడం లేదు. అదేసమయంలో కేంద్రం తీసుకువచ్చిన జీఎస్టీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతగల కుండా చూడడంలోనూ యనమల విఫలమయ్యారని బాబు భావిస్తున్నారు. జీఎస్టీ నుంచి టీటీడీని తప్పించలేకపోయారని, అదేవిధంగా ప్రతి విషయానికీ తానే స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించాల్సి రావడంపైనా బాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఉన్నంత చురుగ్గా 'యనమల'పనిచేయటం లేదని చంద్రబాబు అంటున్నారట. అంతే కాకుండా తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో కూడా యనమల వైఖరి వివాదాస్పదం అవుతోంది. దీనిపై అక్కడి నాయకులు పలుసార్లు అధినేతకు తమ మనస్సులోని మాట చెప్పారట. ఇటీవల జరిగిన కాకినాడ పురపాలకసంఘం ఎన్నికల సందర్భంగా 'యనమల' వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదం అయింది. ఆయన పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారం నిర్వహించలేదని, ప్రెస్‌మీట్లకే పరిమితమయ్యారనే విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇంకా యనమలను కొనసాగించడం సరికాదని బాబు భావిస్తున్నారట. డిసెంబరు తరువాత టీడీపీలోను, ప్రభుత్వంలోను కీలక మార్పులు వస్తాయని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుపై వేటువేయబోతున్నారని సమాచారం. అయితే, ఆయనను నొప్పించకుండా రాజ్యసభకు పంపాలని బాబు అనుకుంటున్నారట. ఇదే జరిగితే టీడీపీ ప్రభుత్వంలో పెద్ద మార్పు ఖాయమని అంటున్నారు. అయితే, ఇక, యనమల ప్లేస్‌లో ఎవరిని తీసుకుంటారు? అనే ది ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్‌గా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com