దైవానికే భద్రతే లేకుండా పోయింది

- October 29, 2017 , by Maagulf
దైవానికే భద్రతే లేకుండా పోయింది

భక్తి శ్రద్దలతో దైవ ప్రార్థన చేయాల్సిన అర్చకులు దారి తప్పుతున్నారు. భగవంతునికి, భక్తునికి మధ్య అనుసంధానకర్తగా చెప్పుకునే పూజారులు కట్టుబాట్లు అతిక్రమిస్తున్నారు. కాసుల కక్కుర్తితో ఏకంగా ఆ దైవానికే శఠగోపం పెడుతున్నారు. అవసరాలకు హుండీలోని డబ్బుని వాడుకోవడం, ఆభరణాలను అమ్ముకోవడం లాంటి వార్తలు గతంలో విన్నాం. కానీ ఈసారి ఏకంగా అమ్మవారి మంగళసూత్రాన్నే తాకట్టుపెట్టాడు ఓ పూజారి. బెజవాడ ఇంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గమ్మ అమ్మ ఆలయంలోని ఉపాలయంలో ఈ అపచారం చోటు చేసుకుంది. ఉపాలయంలో ఉన్న శ్రీవల్లి అమ్మవారి మంగళసూత్రాన్ని పూజారి తాకట్టు పెట్టిన విషయం బయటకు రావడం సంచలనంగా మారింది.
బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామివారి ఉపాలయం ఉంది. ఇందులో శ్రీవల్లి అమ్మవారి విగ్రహానికి ఉన్న తాళి మూడు నెలల కింద మాయమైంది. ఆరా తీస్తే.. ఆ మంగళ సూత్రాన్ని ఓ అర్చకుడు గుట్టుచప్పుడు కాకుండా మాయం చేసి తాకట్టు పెట్టాడని ఆలయ అధికారులు గుర్తించారు. అయితే విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడిన ఆలయ అధికారులు.. హుటాహుటిన స్పందించి తాకట్టులో ఉన్న అమ్మవారి మంగళసూత్రాన్ని విడిపించారు.
కాగా, ఆలయంలోని కొందరు సిబ్బంది ఈ విషయాన్ని లీక్ చేయడంతో మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కక్కుర్తితో ఇంత దారుణానికి పాల్పడిన అర్చకుడిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దుర్గ గుడిలో అధికారుల తీరు పలు వివాదాలకు కారణమవుతోంది. ఈ క్రమంలో తాళిబొట్టు తాకట్టు అంశం మరో వివాదాన్ని రేపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com