బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం: హైదరాబాద్ వాతావరణ కేంద్రం

- October 30, 2017 , by Maagulf
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం: హైదరాబాద్ వాతావరణ కేంద్రం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. శ్రీలంక తీరానికి నైరుతి దిశగా మయన్మార్ సమీపంలో రేపటి వరకు ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు దీని దశను చెప్పలేమన్నారు వాతావరణ అధికారులు. రెండు, మూడు రోజుల్లో అల్పపీడన పయనంపై స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు తెలంగాణలో పగలు పొడి వాతావరణం ఏర్పడుతోంది. గాలిలో తేమ శాతం తగ్గడమే దీనికి కారణం. ఇక పగటి పూట మేఘాలు లేకపోవడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకి త్వరగా వేడెక్కుతోందని అధికారులు చెప్పారు. 

మరోవైపు ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి చెన్నైతో సహా పలు కోస్తా జిల్లాలు తడిసిముద్దవుతున్నాయి. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపై వాహనాలు నెమ్మదిగా కదలడంతో పలు చోట్ల ట్రాఫిక్‌ స్తంభించి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాతావరణం అనుకరించకపోవడంతో సుమారు 25 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ఇవాళ కూడా చెన్నైతో పాటు రాష్ట్రంలోని ఎనిమిది తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. మరో ఐదు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, నాగపట్నం జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ఇవాళ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com