హిందువులను టార్గెట్ చేస్తున్న కమల్

- November 02, 2017 , by Maagulf
హిందువులను టార్గెట్ చేస్తున్న కమల్

త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన కమలహాసన్.. హిందువులు టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. హిందువులపై వివాదాస్పద, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో హిందువులను అతివాదులతో పోల్చిన కమల్.. ఇప్పుడు హిందువులను ఉగ్రవాదులతో పోల్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు.
హిందువుల్లో ఉగ్రవాదులు ఉన్నారని, వారితో చాలా ప్రమాదం ఉందనే అర్థంలో కమలహాసన్ వ్యాఖ్యలు చేశారు. హిందువుల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న కమల్.. వారు విధ్వంసాలు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో హిందువులు ఉగ్రవాదం వైపు చూడలేదని, విధ్వంసాలు సృష్టించలేదని, సమస్యలను చర్చల ద్వారానే పరిష్కారం చేసుకునే వారని, అయితే ఇప్పుడు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారని కమల్ అన్నారు. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోందని.. దేశంలో హిందూ టెర్రర్ లేదని ఎవరూ చెప్పలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందూ ఉగ్రవాదం ఉందన్న విషయాన్ని అతివాదులు అంగీకరించి తీరాల్సిందేనని కమల్ పేర్కొన్నారు.
'ఆనంద వికటన్' అనే తమిళ మ్యాగజైన్‌కు ప్రతి వారం రాసే కాలమ్‌లో కమల్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'సత్యమేవ జయతే' అనే నినాదంపై ప్రజలకు నమ్మకం పోతోందని కమల్ తన కాలమ్‌లో పేర్కొన్నారు. 'ఒకప్పుడు సత్యం ఒంటరిగా విజయం సాధించేది. కానీ ఇప్పుడు శక్తి ఒక్కటే గెలుస్తోంది. ఇది ప్రజల్ని అమానుషంగా తయారుచేస్తోంది' అని అభిప్రాయపడ్డారు. కాషాయ దళంలోకి ఉగ్రవాదం వచ్చి చేరిందని, దీన్ని వాళ్లు అంగీకరించాల్సిందేనని కమల్ తన వ్యాసంలో రాశారు.
బీజేపీని టార్గెట్ చేసిన కమల్.. కేరళ ప్రభుత్వాన్ని ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది. హిందుత్వ శక్తులను అణచివేసి, మతపరమైన అల్లర్లకు అడ్డుకట్టవేయడంలో కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అద్భుతం అని కమల్ కొనియాడారు. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వంతో పోలిస్తే కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చారు.
కమలహాసన్ ఉద్దేశ్యం ఏంటో కానీ.. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. హిందువుగా పుట్టిన కమలహాసన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. హిందువులను రెచ్చగొట్టేలా, కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడుతున్నారు. అసలు హిందువులపై కమల్ ఎందుకిలా విషం కక్కుతున్నారో అర్థం కావడం లేదంటున్నారు. కాగా, నవంబర్ 7న తన పుట్టిన రోజు సందర్భంగా ఓ కీలక ప్రకటన చేయబోతున్నట్లు కమల్ హాసన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అలాంటి ఈ సమయంలో కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com