ఇక విదేశాల్లో పనిచేసే భారతీయులకి ఈపీఎఫ్‌వో భద్రత

- November 03, 2017 , by Maagulf
ఇక విదేశాల్లో పనిచేసే భారతీయులకి ఈపీఎఫ్‌వో భద్రత

విదేశాలకు వెళ్లి పనిచేసే భారతీయ ఉద్యోగులకు ఇకపై ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌వో భద్రత అందించనుంది. తాము పనిచేసే దేశంలో అందిస్తున్న సామాజిక భద్రతా పథకాలను తామే మినహాయించుకుని ఈపీఎఫ్‌వోను ఎంచుకునే సౌలభ్యాన్ని ఈపీఎఫ్‌వో కల్పిస్తోందని సెంట్రల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ వీపీ జోయ్‌ శుక్రవారం తెలిపారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో వ్యవస్థను సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఈ సదుపాయానికి సంబంధించిన మొత్తం ప్రక్రియను సులభతరంగా తీర్చిదిద్దామని చెప్పారు. ఎవరైతే ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్తారో వారికి సర్టిఫికెట్‌ ఆఫ్‌ కవరేజీ (సీవోసీ)ని అందిస్తామని, దాన్ని పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఒక పేజీతో కూడిన దరఖాస్తు ఫారాన్ని ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 18 దేశాలతో ఈపీఎఫ్‌వో ఒప్పందం కుదుర్చుకుంది.

'స్వల్పకాలం పాటు పనిచేసేందుకు ఇతర దేశాలకు వెళ్లేవారికి ఈ సౌకర్యం బాగా ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఉంటున్న భారతీయులు తాము సంపాదించిన సొమ్మును అక్కడి పథకాల్లో దాచుకుంటున్నారు. అయితే వారు స్వదేశం తిరిగి వచ్చేస్తే ఆ సొమ్మును పొందేందుకు ఎక్కువకాలం ఆగాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సీవోసీని ఎంచుకోవడం ద్వారా విదేశాల్లో పనిచేసే వారి సొమ్ము దీర్ఘకాలం ఆ దేశంలో ఉండిపోదు' అని జోయ్‌ వివరించారు.

ప్రపంచంలో ఉద్యోగులకు భద్రతను అందించే అతిపెద్ద సంస్థల్లో ఈపీఎఫ్‌వో ఒకటి. ఇందులో 9.26లో యజమానులతో పాటు, 4.5 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. ప్రతి నెలా 60.32 లక్షల మంది ఈపీఎఫ్‌వో ద్వారా పింఛన్లు అందుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com