చెన్నై తమిళనాడులో మరో 24 గంటలు భారీ వర్షాలు

- November 03, 2017 , by Maagulf
చెన్నై తమిళనాడులో మరో 24 గంటలు భారీ వర్షాలు

చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి... నగరంతో పాటు.. రాష్ట్రంలో పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కకున్నాయి. ఐటీ రంగంతో పాటు... అటు ఉత్పత్తి రంగాన్ని వర్షాలు నిండా ముంచాయి. మరో 24 గంటలు భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ నివేదికలు కంగారు పుట్టిస్తున్నాయి.

గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తమిళనాడులోని తీర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. చెన్నై సహా పలు పట్టణాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వర్షానికి కరెంట్ స్తంబాల వైర్లు తగిలి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతిచెందారు. వర్షాల కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

బంగాళాఖాతంలో శ్రీలంక నుంచి తమిళనాడు తీరం వరకు ఆవరించి ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో గడిచిన రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. రాజధానిలో సుమారు 30 సెంటీమీటర్ల వర్షం పడినట్టు తెలుస్తోంది. మరో 24గంటలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

భారీ వర్షాల కారణంగా చెన్నై నగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. నగరంలో 70 కాలనీల్లో వరద నీరు చుట్టుముట్టింది. కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రజారవాణా వ్యవస్థపై వర్షాలు ప్రభావం అధికంగా పడింది. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఎట్‌ హోం అవకాశం కల్పించాయి. చాలా సంస్థలు ఆఫీసులకు రానవసరం లేదని ప్రకటించాయి. నగరంలో కాలనీలను ముంచెత్తిన వరద ఇప్పడిప్పడే తగ్గుతుండడంతో విద్యుత్‌ సరఫరా పునరుద్దరిస్తున్నారు. అటు జాతీయ విపత్తు నిర్వహణా సిబ్బంది నగరంతో పాటు.. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.  అటు నాగపట్టణం ప్రాంతంలో హ్యాండ్లూమ్‌ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. అటు మత్య్సకారులు కూడా గడిచిన 15 రోజులుగా చేపల వేటకు వెళ్లకపోవడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. 

విమాన సర్వీసులపై పెద్దగా ప్రభావం పడలేదని ఎయిర్‌పోర్టు అధారిటి ప్రకటించింది. సిటీ బస్‌ సర్వీసులు మాత్రం నిలిపివేశారు. రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. అయితే  ఎవరూ ఆందోళన చెందవద్దని... నగరంలో 115 షెల్టర్లు సిద్దం చేశామని సీఎం పళనిస్వామి ప్రకటించారు. 2015లో వచ్చిన స్థాయిలో వర్షాలు లేవని... భయపడాల్సిన పనిలేదన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com