లక్ష్మీ పుత్రుడిగా సత్తా చాటిన ముకేశ్ అంబానీ

- November 16, 2017 , by Maagulf
లక్ష్మీ పుత్రుడిగా సత్తా చాటిన ముకేశ్ అంబానీ

న్యూఢిల్లీ : ముఖేష్‌ అంబానీ మరోసారి ఫోర్బ్స్‌ జాబితాలో తన హవా చాటారు. ఆసియాలో అత్యంత ధనికవంతమైన కుటుంబాల్లో భారత్‌కు చెందిన ముఖేష్‌ అంబానీనే టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. ఆయన కుటుంబ నికర సంపద 19 బిలియన్‌ డాలర్లు పెరిగి 44.8 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలో అత్యంత పాపులర్‌ బ్రాండు అయిన శాంసంగ్‌కు చెందిన లీస్‌ కుటుంబాన్ని అధిగమించి, ఆయన నెంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నట్టు ఫోర్బ్స్‌ తెలిపింది. రెండో స్థానంలోకి పడిపోయినప్పటికీ లీ కుటుంబపు నికర సంపద 11.2 బిలియన్‌ డాలర్లు పెరిగి 40.8 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. గత ఏడాదిగా శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ షేర్లు 75 శాతం మేర పెరిగినట్టు వెల్లడైంది. ఫోర్బ్స్‌ రూపొందించిన ఆసియాలో అత్యంత ధనికవంతమైన 50 కుటుంబాల జాబితాలో సన్ హంగ్ కై ప్రాపర్టీస్‌ను నడిపే ఆసియాలో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ ఫ్యామిలీ హాంగ్‌ కాంగ్‌ క్వాంక్‌ కుటుంబం మూడో స్థానంలో నిలిచింది. ఈ కుటుంబపు నికర సంపద 40.4 బిలియన్‌ డాలర్లు.

ఈ జాబితాలో టాప్‌ 10 స్థానంలో చోటు దక్కించుకున్న ధనిక కుటుంబాల్లో ముఖేష్‌ అంబానీకి చెందిన కుటుంబం మాత్రమే ఉంది. భారత్‌లో అంబానీ కంటే ఏ ఒక్క కుటుంబం కూడా ఈ మేర సంపదను ఆర్జించలేదని, డాలర్‌లో, పర్సంటేజ్‌లో ఈ ఏడాదిలో అతిపెద్ద గెయినర్‌గా ముఖేష్‌ అంబానీ కుటుంబమే నిలిచినట్టు ఫోర్బ్స్‌ తెలిపింది. ముఖేష్‌ అంబానీ ఆధ్వర్యంలో నడిచే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు రిఫైనింగ్‌ మార్జిన్లు పెరగడం, టెలికాం సంస్థ జియోకు ఆదరణ విపరీతంగా లభించడం ఈయన కుటుంబానికి బాగా సహకరించింది. లాంచ్‌ అయిన ఏడాదిలోనే జియో 140 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లను తన సొంతం చేసుకుంది. ఆసియా రిచెస్ట్‌ ఫ్యామిలీస్‌ 2017 జాబితాలో 18 కుటుంబాలతో మూడోసారి భారత్‌ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇతర కుటుంబాలు ప్రేమ్‌జీ, హిందూజా, మిట్టల్స్‌, మిస్త్రీలు, బిర్లాలు ఉన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com