హర్యానాలో టెన్షన్‌.. టెన్షన్‌..

- November 25, 2017 , by Maagulf
హర్యానాలో టెన్షన్‌.. టెన్షన్‌..

హర్యానాలో హైఅలర్ట్ విధించారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రెండు పోటా పోటీ సభలు ఇవాళే జరగనుండడంతో ఏం జరుగుతుందోనన్న హైటెన్షన్ నెలకొంది. మొబైల్ ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్‌లపై ఇవాళ అర్ధరాత్రి వరకు నిషేధం విధించారు. రోహ్‌తక్ జిల్లాలోని జసియా గ్రామంలో ఆదివారం బహిరంగ సభను నిర్వహించేందుకు ఆలిండియా జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి సిద్ధమైంది. జాట్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ మరో దఫా ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నారు ఆలిండియా జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి చీఫ్ యశ్‌పాల్ మాలిక్. మరోవైపు ఇవాళే.. అటు జింద్‌లోనూ కురుక్షేత్ర ఎంపీ, బీజేపీ నేత రాజ్ కుమార్ సైనీ కూడా ఓ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇదే హైటెన్షన్‌కు కారణమైంది. జాట్లకు రిజర్వేషన్లు దండగ అంటూ సైనీ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. జాట్ సభకు వ్యతిరేకంగా ఈ సభను నిర్వహిస్తుండడంతో హర్యానాలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. 

మరోవైపు పరిస్థితి అదుపు తప్పకుండా హర్యానా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 25 కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపింది. 13 జిల్లాల్లో ఈ అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. జింద్, హన్సీ, భివానీ, హిసార్, ఫతేహాబాద్, కర్ణాల్, పానిపట్, కైథల్, రోహ్‌తక్, సోనిపట్, జజ్జర్, ఛరకీ దాద్రి జిల్లాల్లో హై అలర్ట్ విధించారు. 144 సెక్షన్ కొనసాగుతోంది. ప్రధానంగా రోహ్‌తక్, జింద్ జిల్లాల్లోనే ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉంది. ఒక్క  రోహ్‌తక్‌లోనే 3500 భద్రతా సిబ్బందిని మోహరించారు. 

హర్యానాలో 19 పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. క్షుణ్నంగా పరిశీలించాకే వాహనరాకపోకలను అనుమతిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల పోలీసులకు ఆందోళనకారులకు మధ్య స్వల్ప ఘర్షణలు తలెత్తాయి. ఇటీవలే గుర్మీత్ బాబా అరెస్ట్ జరిగినప్పుడు హిసార్‌లో ఆందోళనలు చెలరేగి పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు బహిరంగ సభల్లో ఉద్రిక్తతలు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com