గన్నవరం నుంచి కార్గో సేవలు
- December 04, 2017
అమరావతి: గన్నవరం విమానాశ్రయం నుంచి సరకు రవాణా విమానాలు(కార్గో సేవలు) నడిపేందుకు అవసరమైన అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయంలో కార్గో సేవలు అందించే శ్రీపా లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇక్కడా ఎంపికైంది. దీంతో కార్గో భవనంతో సహా అన్ని ఏర్పాట్లూ పూర్తయి.. గత జులై నుంచే సేవలు అందించాలని భావించారు. అయితే కీలకమైన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) నుంచి భద్రతా పరమైన అనుమతుల మంజూరుకు సమయం పట్టింది. పోలీస్ కమిషనరేట్, కలెక్టరేట్ సహా అన్ని అనుమతులూ బీసీఏఎస్‌కు వెళ్లిపోయాయి. దీంతో ఈ వారంలో బీసీఏఎస్ నుంచి కార్గో సేవలకు అవసరమైన అనుమతులను ఇవ్వనున్నారు. వచ్చే వారం తర్వాత ఎప్పుడైనా ప్రారంభించనున్నారు. ఈలోగా విమానాశ్రయంలో నిర్మించిన భవనంలో ఎక్స్‌రే బ్యాగేజీ సహా ఇతర యంత్ర పరికరాలను బిగించే పనులు ప్రారంభించారు.
గన్నవరం విమానాశ్రయం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏటేటా ప్రయాణికుల పెరుగుదలలో గత మూడేళ్లుగా దేశంలో మొదటి స్థానంలో నిలుస్తోంది. అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించేందుకు అవసరమైన ప్రక్రియ సైతం వేగవంతమైంది. ప్రస్తుతం ఏటా ఏడున్నర లక్షల మంది గన్నవరం నుంచి దేశంలోని వివిధ నగరాలకు ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్య రెండేళ్ల కిందటి వరకూ కేవలం రెండు లక్షల లోపే ఉండేది. సర్వీసుల సంఖ్యను పెంచితే.. ప్రయాణికుల ఆదరణ ఉంటుందని ఎప్పటినుంచో స్థానికంగా ఉండే వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి. వారన్నట్టుగానే.. హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు సహా ఏ నగరానికి కొత్తగా విమాన సర్వీసును ప్రారంభించినా 80శాతం పైనే ఆక్యుపెన్సీ ఉంటోంది. ప్రస్తుతం కార్గో సేవలను అందుబాటులోనికి తెచ్చినా.. ఆదరణ భారీగానే ఉండబోతోంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి మూడు జిల్లాల్లోని వ్యవసాయ, ఆక్వా, మాంస ఉత్పత్తుల ఎగుమతికి గన్నవరం విమానాశ్రయంలోని కార్గో సేవలు కీలకంగా నిలవనున్నాయి. మూడున్నర దశాబ్దాల కిందటే గన్నవరం విమానాశ్రయం నుంచి విదేశాలకు మాంస ఉత్పత్తులను ఎగుమతి చేసేవారు. అప్పట్లో గన్నవరంలో ఉండే బేకన్ ఫ్యాక్టరీ మాంస ఉత్పత్తులను విదేశాలకు ఇక్కడి నుంచి తీసుకెళ్లేవారు. తర్వాత.. విమానాశ్రయం అభివృద్ధిపై ఎవరూ దృష్టిపెట్టకపోవడంతో.. భద్రతాపరమైన కారణాల వల్ల కార్గో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
గన్నవరం నుంచి ప్రస్తుతానికి బెల్లీ కార్గో సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల విమానాల్లోనే కిందిభాగంలో సరకును తరలిస్తున్నారు. అయితే.. వీటిని కూడా పూర్తిస్థాయిలో బుక్ చేసి పంపించే వ్యవస్థ లేకపోవడంతో పాటూ.. భారీగా సరకును తరలించాలంటే వీటిలో సాధ్యం కాదు. పూర్తిస్థాయిలో విమానాశ్రయం నుంచి కార్గో సేవలను శ్రీపా లాజిస్టిక్స్ ఆధ్వర్యంలో చేపడితే.. అవసరాన్ని బట్టి.. సరకును నిలువ ఉంచేందుకు అవసరమైన శీతల గిడ్డంగులను సైతం అందుబాటులోనికి తేనున్నారు. ఇక్కడి నుంచి పంపించే సరకు ఆధారంగా విమానాశ్రయానికి శ్రీపా లాజిస్టిక్స్ సంస్థ చెల్లింపులు చేస్తుంది. తొలుత ప్రయాణికుల విమానాల్లోనే సరకును తరలించి.. తర్వాత డిమాండ్‌ను బట్టి పూర్తిస్థాయి కార్గో సర్వీసులను నడపనున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!