నేడు జయలలిత ప్రధమ వర్థంతి.. పోయెస్ గార్డెన్‌లో భారీగా ఏర్పాట్లు

- December 04, 2017 , by Maagulf
నేడు జయలలిత ప్రధమ వర్థంతి.. పోయెస్ గార్డెన్‌లో భారీగా ఏర్పాట్లు

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ సీఎం జయలలిత కన్నుమూసి ఇవాళ్టికి ఏడాది. గతేడాది ఇదే రోజున చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు జయలలిత. అమ్మ మరణంతో రాష్ట్రం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. అన్నాడీఎంకే కార్యకర్తలైతే గుండెలు బాదుకుంటూ కుప్పకూలిపోయారు. జయలలిత లేదన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సంక్షేమ పథకాలతో తమ జీవితాల్లో వెలుగులు నింపిన జయకు.. కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి వర్ధంతి నిర్వహిస్తున్నారు.

జయ మరణంతో.. అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలిపోయింది. ఆమె వారసుడిపై కన్ఫూజన్‌ కంటిన్యూ అవుతోంది. జయ స్థానాన్ని ఆక్రమించుకోవాలనుకున్న శశికళ.. అక్రమాస్తుల కేసులో ఊచలు లెక్కబెడుతున్నారు. పన్నీర్‌సెల్వంను పక్కకునెట్టి మరీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ.. సీఎం కావాలన్న ఆశ తీరకుండానే జైలుకెళ్లాల్సి వచ్చింది. జయ మరణించాక.. చిన్నమ్మా నువ్వే పార్టీని నడపాలంటూ మోకరిల్లిన నేతలంతా.. తర్వాత శశికళకు అడ్డం తిరిగారు. డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం, సీఎం పళనిస్వామి నేతృత్వంలోని పాలకమండలే.. ప్రస్తుతం అన్నాడీఎంకేను నడిపిస్తోంది.

అమ్మ లేని రాష్ట్రంలో అంతా గందరగోళమే. అధికార పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రవరిస్తున్నారు. జయ మరణం తర్వాత ఇద్దరు సీఎంలు మారారు. తనది విశ్వకుటుంబమని ప్రకటించుకున్న జయకు.. మేమే వారసులమంటూ నలుగురైదుగురు నాయకులు సీన్‌లోకి వచ్చారు. వీరిలో అమ్మకు అసలు వారసులు ఎవరో తెలియక తమిళవాసులు అయోమయంలో ఉన్నారు. ఇదే అవకాశంగా మార్చుకుని.. బీజేపీ అన్నాడీఎంకేను కబళించేందుకు ప్రయత్నిస్తోంది. ఆఖరికి ప్రభుత్వ వ్యవహారాల్లోనూ కమలనాథులు జోక్యం చేసుకుంటున్నారు. ఏకంగా మంత్రులకే ఫోన్లు చేసి ఆదేశాలు జారీ చేస్తున్నారు.

జయలలిత చనిపోయాక తమిళనాడులో అభివృద్ధి కుంటుపడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో.. తమిళనాడుకు రావాల్సిన పరిశ్రమలన్నీ వేరే ప్రాంతాలకు తరలి పోతున్నాయి. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రభుత్వ వర్గాలే చెప్తున్నాయి. గతంలో ప్రపంచ పరిశ్రమల సదస్సు నిర్వహించి లక్షా 50 వేలకోట్ల పెట్టుబడులు సాధించిన రాష్ట్రంలో.. ఇప్పుడు పరిశ్రమల గురించే పట్టించుకునే వారే లేరని అధికారులు వాపోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com