ఇజ్రాయెల్ రాజధాని జెరుసలెం.. ట్రంప్ ఇవ్వనున్న సంచలన ప్రకటన!
- December 06, 2017
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేనె తుట్టెను కదిపారు. ఇక నుంచి ఇజ్రాయెల్ రాజధానిగా జెరుసలెంను అమెరికా గుర్తించనున్నది. దీనిపై భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30 గంటలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటన చేయనున్నారు. దశాబ్దాలుగా ఉన్న అమెరికా విధానంతోపాటు ప్రజల ఆకాంక్షలు, ఆ ప్రాంతంలోని మిత్ర దేశాల హెచ్చరికలను ట్రంప్ పక్కన పెట్టేశారు. అంతేకాదు ఇప్పటివరకు టెల్ అవివ్‌లో ఉన్న అమెరికా ఎంబసీని కూడా జెరుసలెంకు తరలించనున్నట్లు ట్రంప్ ఈ ప్రకటనలోనే చెప్పనున్నారు. ఈ ప్రక్రియకు కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా విదేశాలకు వెళ్లే అమెరికా పౌరులకు జాగ్రత్తగా ఉండాల్సిందిగా అమెరికా హెచ్చరికలు జారీ చేస్తున్నది. తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇప్పటికే పాలస్తీనియన్ నేషనల్ సెక్యూరిటీ, సౌదీ అరేబియా, జోర్డాన్, ఈజిప్ట్, ఇజ్రాయెల్ దేశాల నేతలకు ట్రంప్ ఫోన్ల ద్వారా సమాచారమిచ్చారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పాలస్తీనియన్లను ఆగ్రహానికి గురి చేసింది. ఈస్ట్ జెరుసలెం తమదిగా భావిస్తున్న ఈ దేశ ప్రజలు ఈ నిర్ణయానికి నిరసనగా మూడు రోజులు ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం చాలా పెద్ద తప్పని, ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారి ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడం కష్టమవుతుందని వివిధ దేశాధినేతలు, అధికారులు ట్రంప్‌కు చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ కూడా తన ఆందోళనను ట్రంప్‌కు వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఇచ్చిన ముఖ్యమైన హామీ నెరవేరబోతున్నదని వైట్‌హౌజ్‌లోని సీనియర్ అధికారులు చెప్పారు. ఇది ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితులు, సరిహద్దులపై ఎలాంటి ప్రభావం చూపబోదని వాళ్లు స్పష్టంచేశారు.
3 వేల ఏళ్లుగా జెరుసలెమే తమ రాజధాని అని ఇజ్రాయెల్ చెబుతున్నది. నగరంలోని పశ్చిమ ప్రాంతంలోనే ప్రధానమంత్రి కార్యాలయంతోపాటు ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంట్ ఉన్నాయి. శాంతిని నెలకొల్పాలన్న ఉద్దేశంతో చాలా కాలంగా ఈ విషయంలో అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయిందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. అయితే ఉన్న వాస్తవాన్ని గుర్తించడమే ముఖ్యమని భావించి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఆందోళనలు చెలరేగే ప్రమాదం ఉండటంతో ఇప్పుడు ప్రపంచం దృష్టంతా ఇక్కడే కేంద్రీకృతమైంది. ఇప్పటికే పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తమ నిరసనను ఫోన్‌లోనే ట్రంప్‌కు తెలియజేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దీనిని అంగీకరించబోమని ఆయన తేల్చి చెప్పారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా, సౌదీ అరేబియా రాజు సల్మాన్ కూడా ట్రంప్ నిర్ణయం చాలా ప్రమాదకరమైనదని అన్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!