మాల్యాకు దిమ్మతిరిగే షాకిచ్చిన లండన్ కోర్ట్
- December 10, 2017
జల్సాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే వ్యక్తుల్లో ఒకనిగా పేరు పొందిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఇప్పుడు నిరుపేదగా మారిపోయాడు. భారత్‌లోని డజనుకు పైగా బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల అప్పులను ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన ఆయన ప్రస్తుతం లండన్‌లో వారానికి 5 వేల పౌండ్ల (రూ. 4.5 లక్షల)తో జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న కేసుపై లండన్‌లో విచారణ జరుపుతున్న వెస్ట్‌మినిస్టర్ కోర్టు డాక్యుమెంట్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఈ నెల 3వ తేదీన ఈ కేసు విచారణ ప్రారంభించడానికి ముందు రోజు మాల్యాకు చెందిన ఆస్తులన్నింటినీ స్తంభింపజేయాలని వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఆదేశించింది. బ్రిటన్‌లో మాల్యా ఆస్తులన్నింటినీ స్తంభింపజేయాలని పేర్కొంటూ భారత న్యాయస్థానం ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన తీర్పుపై విచారణకు అనుమతిస్తూ వెస్ట్‌మినిస్టర్ కోర్టు న్యాయమూర్తి ఈ ఆదేశాన్ని జారీ చేశారు. ప్రస్తుతం మాల్యా తన జీవనం కోసం వారానికి 5 వేల పౌండ్ల చొప్పున అలవెన్సు పొందాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే ఈ అలవెన్సును 20 వేల పౌండ్లకు పెంచాలని మాల్యా చేసుకున్న విజ్ఞప్తిపై న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా..దేశంలోని బ్యాంకు రుణాల కేసులో నిందితుడిగా ఉన్న విజయ్‌మాల్యాను భారత్‌కు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే లండన్ కోర్టులో ఆయనపై విచారణ జరుగుతున్నందున భారత్‌కు తీసుకురావడంలో జాప్యం జరిగిందని తెలిపింది. ఇందుకు అవసరమైన చట్టపరమైన చర్యలన్నీ తీసుకుంటున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. నగదు ఎగవేత ఆరోపణలు రావడంతో 2016 మార్చి రెండోతేదీన మాల్యా లండన్ పారిపోయి, ప్రవాసంలో ఉంటున్న సంగతి తెలిసిందే లండన్‌లోని కోర్టులో సోమవారం మాల్యాకేసుపై విచారణ జరగనుంది. మాల్యా లండన్ పౌరసత్వం కూడా కలిగి ఉన్న నేపథ్యంలో ఆయన్ను దేశానికి అప్పగించే విషయం లో అనేక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని రవీష్ కుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!