ముఖ్యమంత్రి జయలలిత కాన్వాయ్ వర్షంలో చిక్కుకుంది

- November 16, 2015 , by Maagulf
ముఖ్యమంత్రి జయలలిత కాన్వాయ్ వర్షంలో చిక్కుకుంది

తమిళనాడులో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సామాన్య ప్రజలే కాదు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్లో సోమవారం ఆమె కాన్వాయ్ కాసేపు చిక్కుకుంది. వర్షాలతో అతలకుతలమైన తన నియోజకవర్గం డాక్టర్ రాధాకృష్ణ నగర్లో పర్యటించేందుకు వెళ్లే సమయంలో సీఎం కాన్వాయ్ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయింది. చెన్నైతోపాటు తమిళనాడు అంతటా కురుస్తున్న వర్షాలతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షబీభత్సంలో ఇప్పటికే 71మంది మరణించారు. దీంతో రాష్ట్రమంతా వర్షబీభత్సం కొనసాగుతుండగా.. ప్రజలకు సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం జయలలిత బాధిత ప్రజలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. 'ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు. మిమ్మల్ని ఆదుకోవడానికి నేను ఉన్నాను' అని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చినట్టు అన్నాడీఎంకే ట్విట్టర్లో తెలిపింది. వర్షబీభత్సంలో బాధిత ప్రజలను ఆదుకునేందుకు పూర్తిస్థాయిలో సహాయక బృందాలను రంగంలోకి దింపినట్టు ఆమె చెప్పారు. మరోవైపు వర్షాలతో అతలాకుతలమవుతున్న తమిళనాడును ఆదుకునేందుకు కేంద్రం ముందుకువచ్చింది. సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) నుంచి 400 మంది సిబ్బందితో కూడిన 11 బృందాలను తమిళనాడుకు పంపించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com