కాంగ్రెస్ సారధిగా 16న పగ్గాలు చేపట్టనున్న రాహుల్

- December 11, 2017 , by Maagulf
కాంగ్రెస్ సారధిగా 16న పగ్గాలు చేపట్టనున్న రాహుల్

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏ మేరకు పార్టీ ఎన్నికల కమిటీ చీఫ్‌ ముళ్లపల్లి రామచంద్రన్‌ ప్రకటన చేశారు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా డిసెంబర్‌ 16న బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు. అధ్యక్ష పదవికోసం మొత్తం 89 నామినేషన్‌లు వచ్చాయని, అలా నామినేషన్‌ వేసిన వారంతా వెనక్కు తీసుకోవడంతో రాహుల్‌గాంధీ ఏకగ్రీవంగా అధ్యక్ష పదవికి ఎంపికైనట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన రాహుల్‌గాంధీ ఇక నుంచి పూర్తిస్థాయిలో పార్టీ పగ్గాలు అందుకొని అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అధ్యక్ష బాధ్యతలు అధికారికంగా ప్రకటించడంతో నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి పార్టీ బాధ్యతలు అందుకోనున్న ఆరో వ్యక్తిగా రాహుల్‌ నిలవనున్నారు. తరాలవారిగా చూస్తే ఈయన నాలుగో తరం వ్యక్తి. అధ్యక్ష పదవి కోసం రాహుల్‌ ఈ నెల(డిసెంబర్‌) 4న నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే.

సోనియాగాంధీ, ఇతర సీనియర్‌ నేతల సమక్షంలో 16న ఏకగ్రీవంగా ఎన్నికైన రాహుల్‌కు ధ్రువపత్రాన్ని అందుకుంటారు. 2004లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రాహుల్‌ అప్పటి నుంచి వివిధ విభాగాల్లో పనిచేశారు. 2007లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ సారథ్య బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2013లో రాహుల్‌ ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. 2008లో కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థి రాహుల్‌గాంధీ అనే నినాదాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ దాదాపు 20 ఏళ్లు (సరిగ్గా 19 ఏళ్లు) పనిచేశారు. ఇదిలా ఉండగా రాహుల్‌గాంధీని పార్టీ ప్రకటించడంతో అంతటా కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. పలువురు సీనియర్‌ నేతలు రాహుల్‌కు అభినందనలు తెలుపుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com