2018 నాటికి పోలవరం పూర్తి చేస్తాం: గడ్కరీ

- December 13, 2017 , by Maagulf
2018 నాటికి పోలవరం పూర్తి చేస్తాం: గడ్కరీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన సమావేశం అది. ఆ సమావేశం మీదే రాష్ట్ర ప్రయోజనాలు ఆధారపడి ఉన్నాయి. అంతేకాదు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య మైత్రి బంధం కొనసాగింపు ఆధారపడి ఉంది...ఇంకా చెప్పాలంటే అనేక రాజకీయ పరిణామాలకు నాంది కూడా ఆ మీటింగ్ పైనే ఆధారపడి ఉన్నాయి...ఆ సమావేశం...పోలవరంపై కేంద్రమంత్రి గడ్కరీతో ఎపి సిఎం చంద్రబాబు సమావేశం... మరి ఆ సమావేశంలో ఏం జరిగింది....ఆ మీటింగ్ సారాంశం ఏ తేల్చింది. కేంద్రం చంద్రబాబుకు నిజంగానే అనుకూలంగా ఉందా? లేక చెప్పాలి కాబట్టి చెబుతోందా? లేక వ్యతిరేకంగా ఉందా?...ఈ ప్రశ్నలకు జవాబు ఎలా? పోలవరంపై గడ్కరీ ఆదేశాల్లోనే ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది...

పోలవరంపై ఎపి సిఎం చంద్రబాబుతో అత్యంత కీలక సమావేశం అనంతరం కేంద్రమంత్రి గడ్కరీ ఆ ప్రాజెక్టు గురించి చెప్పిన ముఖ్యమైన విషయాలు ఇవీ..పోలవరంను 2018లోపే పూర్తిచేసేందుకు పూర్తి సహకారం..సహాయ, పునరావాస పనులకు 100% వ్యయం కేంద్రమే భరిస్తుంది..కాంక్రీట్‌ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు నెలరోజులు గడువిస్తున్నాం, ఆలోపు అతను లక్ష్యాన్ని చేరుకోకపోతే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండర్‌ ప్రకారం కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తాం...చంద్రబాబుకి తమ్ముడిలా అండగా నిలుస్తా...అని గడ్కరీ బుధవారం రాత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సుదీర్ఘ సమావేశం అనంతరం మీడియాతో చెప్పారు.

 పోలవరం పై కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పిన విషయాల్లో అతి ముఖ్యమైన అంశం ప్రాజెక్టు పూర్తయ్యే సమయం. ఈ ప్రాజెక్టు 2018 కే అందుబాటులోకి వస్తుందని గడ్కరీ చెప్పేశారు. పైగా ముందు 2019 కి ప్రాజెక్టు పూర్తి చెయ్యాలని గడువు అనుకున్నా , 2018 కే ప్రాజెక్టు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.

పోలవరానికి సంబంధించి వరం లాంటి కేంద్రం మాట.సహాయ, పునరావాస పనులకు అయ్యే వ్యయం నూటికి నూరు శాతం తామే భరిస్తామని..అందులో ఎలాంటి అనుమానం అవసరంలేదని...ఖచ్చితంగా ఈ మాట ఎపికి స్వాంతన చేకూర్చే విలువైన మాట.

అయితే కాంక్రీట్‌ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు నెలరోజులు గడువిస్తున్నామని, ఆలోపు అతను నిర్థేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతే అతన్ని తప్పించడం ఖాయమని స్పష్టం చేశారు. కాకపోతే నిర్మాణ బాధ్యతలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండర్‌ ప్రకారం కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. ఇదీ ఎపికి సానుకూలమైన అంశమే.

ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ఫుల్‌టైం సీఈఓ ని నియమించడం అనేది కీలకమైన నిర్ణయం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణమే కాదు దీంతో ముడిపడి ఉండే అనేక అంశాలకు సంబంధించి ఈ ఉద్యోగే కీలకపాత్ర పోషిస్తాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మరయితే అతడు కేంద్రానికి అనుకూలంగా ఉంటాడా? లేక ఎపి ప్రభుత్వానికా? అనే ప్రశ్న ఉద్భవించడం ఖాయం. అయితే అలాంటి కీలక ప్రశ్న పైకి తేలకండా ఉండేందుకు ఈ ఉద్యోగి కావాలని ముఖ్యమంత్రి అడిగారని ఆ ప్రకారమే సిఈవో ను అపాయింట్ చేస్తున్నమని గడ్కరీ చెప్పారు.

హై క్యాడర్ వ్యక్తి కాకుండా ప్రాజెక్టును అక్కడే ఉండి పర్యవేక్షించే వ్యక్తిని తాము కోరుకుంటున్నామని ,అందువల్ల పోస్టుస్థాయిని తగ్గించి పోలవరం దగ్గరే ఉండి పనిచేసే వ్యక్తిని వెతికి పట్టాలని అధికారులకు చెప్పానని గడ్కరీ చెప్పారు. సీఈఓ సిటీలో కూర్చొని పనిచేయడాన్ని తాను అంగీకరించనని, అతడు ప్రతిరోజూ పని గురించి తనకు చెప్పాలని నిర్దేశించడం ద్వారా గడ్కరీ ఏం కోరుకుంటున్నారో ఆయనే స్వయంగా ఆయన మాటల్లోనే చెప్పేశారు.

రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ తనకు సలహాదారుగా ఉంటారని, ప్రతి మూడురోజులకోసారి ఆయన వెళ్లి పనులను చూసి నాకు నివేదిస్తారు. శాఖాపరంగా సమన్వయలోపం ఏదైనా ఉంటే నేరుగా నా దగ్గరకే రమ్మని ఏపీ సాగునీటిశాఖ కార్యదర్శికి చెప్పాను. మా శాఖలో ఏదైనా సమస్య ఉంటే అంతిమ నిర్ణేతగా నేనే నిర్ణయం తీసుకుంటాను. ఈ మాటలతో గడ్కరీ తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టేశారు.

2011 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయం భరించడం మా బాధ్యత అంటూ పెంచిన అంచనా వ్యయాలపై తమ నిర్ణయం ఏమిటో స్పష్టం చేసేశారు గడ్కరీ. తాను సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తినని, ఎప్పుడూ రాజకీయాల గురించి ఆలోచించనని, అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తిచేసేవారినే ఇష్టపడతానని అన్నారు. తద్వారా పోలవరం అనుకున్న సమయంలో పూర్తి చేసి తీరాలనే హెచ్చరిక ను ఫైనల్ గా మరోసారి గుర్తు చేసినట్లయింది.

పోలవరం పై గడ్కరీ అత్యంత స్పష్టంగా చెప్పిన మాటలతో అనుభవశాలి అయిన చంద్రబాబు పరిస్థితి ఆసాంతం అర్థం చేసుకున్నారు. అందుకే గడ్కరీతో సమావేశం ముగిసాక ఒకే మాట చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గడ్కరీతో కాకపోతే ఇంకెవ్వరితోకాదు అని,ఆయన జలవనరుల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం పనుల వేగం పెరిగినట్లు చెప్పారు. ఆ తరువాత గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.

రాజకీయంగా అనేక పరిణామాలకు పోలవరం పై గడ్కరీ,చంద్రబాబుల సమావేశమే నాంది అవుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.గడ్కరీ మాటలను బట్టి ఆయన చెప్పాల్సిందేదో సుతిమెత్తగా చెప్పారే తప్ప ఆయన మాటలు చంద్రబాబుకు అనుకూలంగా అన్వయించుకోవడానికి అంత అవకాశమేమీ లేదనేది వారు విశ్లేషిస్తున్నారు. సిఈవో నియామకం జరిగినప్పటి నుంచే పోలవరంపై కేంద్రం, రాష్ట్రం 
ఏ విధంగా కలసిపనిచేస్తాయో చూడొచ్చని వ్యాఖ్యనిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com