నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు..

- December 14, 2017 , by Maagulf
నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు..

ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్‌ ముస్తాబైంది. ఐదు రోజుల వేడుకకు ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. సాంస్కృతిక వైభవాన్ని చాటే  వేదికలు, కళా తోరణాలతో భాగ్యనగరం తెలుగు వెలుగులు విరజిమ్ముతోంది. ఎల్బీ స్టేడియంలోని ప్రధాన వేదికపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఇవాళ సాయంత్రం మహాసభలు ప్రారంభం కానున్నాయి. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఘనమైన ఆతిథ్యం ఇవ్వబోతోంది తెలంగాణ సర్కార్.

ప్రపంచ మహాసభలను ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం తెలుగుదనం ఉట్టిపడేలా భాగ్యనగరంలో వేదికలు, కళా తోరణాలు సిద్ధం చేసింది. ప్రధాన వేదికతోపాటు ఇందిరా ప్రియదర్శిని కళావేదిక, తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియం, రవీంద్రభారతి వేదికలు కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఎల్బీ స్టేడియంలో ప్రధాన వేదికను 170 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తులో నిర్మించారు. కాకతీయ కళాతోరణం, పాలపిట్ట, బతుకమ్మ, తెలంగాణ తల్లి విగ్రహాలు వేదికపై ఉండబోతున్నాయి. 

సభా ప్రాంగణంలో సాహితీమూర్తుల కటౌట్లు ఏర్పాటు చేశారు, సాహిత్యానికి తమ జీవితాన్నంతా ధారపోసిన వందమంది ప్రముఖుల పేరిట..హైదరాబాద్ చుట్టూ స్వాగతతోరణాలు అమర్చారు. చారిత్రక కట్టడాలు, ప్రధాన కూడళ్లు..ఇలా నగరమంతా విద్యుత్ కాంతులతో శోభాయమానంగా మార్చేశారు. బమ్మెర పోతన వేదికపై సాయంత్రం ఐదు గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మహాసభలను ప్రారంభించనున్నారు. జాతీయ గీతం ఆలాపనతో కార్యక్రమాలు ఆరంభమవుతాయి. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి స్వాగతోపన్యాసం అనంతరం బమ్మెర పోతన పద్యాల పఠనం చేపడతారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరిస్తారు. ప్రఖ్యాత గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ రాసిన పాటపై 25 నిమిషాలపాటు రూపొందించిన లేజర్‌షో మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతోంది. ప్రారంభ వేడుకలో పెద్దఎత్తున బాణాసంచా కాల్చనున్నారు.

ప్రపంచ మహాసభలకు సన్నాహాకంగా రాష్ట్రమంతా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చరిత్రకెక్కని చరితార్థులు, ధనాభిరామం, జాతీయగేయాలు, భాగ్యనగర వైభవం వంటి 25 పుస్తకాలను టూరిజం ప్లాజాలో ఎంపీ కవిత ఆవిష్కరించారు540. కవులు, రచయితలు, కళాకారులు, సాహిత్యసంస్థలతో మంత్రి హరీశ్‌రావు సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గొప్పదనం ఈ సభల ద్వారా ప్రపంచవ్యాప్తం కానుందన్నారు.

మహాసభల కోసం దేశ,విదేశాల నుంచి వచ్చే వేలాదిమంది  ప్రతినిధులకు ఘనమైన అతిథ్యం కల్పించబోతోంది ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు నియమించింది. ప్రతినిధులందరికి అవసరమైన రవాణ, వసతి కల్పించనుంది. మహాసభల ఏర్పాట్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, సీఎస్ ఎస్పీ సింగ్  నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.574. పోలీసులు 12 వేల మందితో భద్రతాచర్యలు చేపట్టారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com