ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరిన్ని నగరాల్లో దాడులకు సిద్ధంగా ఉన్నారు
- November 17, 2015
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరిన్ని నగరాల్లో దాడులకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ జాన్ బ్రెన్నన్ వెల్లడించారు. ఐఎస్ ఉగ్రవాదులు వరుస దాడులకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని, అందులో భాగంగానే తొలిదాడి ప్యారిస్ నగరంపై చేశారని, త్వరలో మరిన్ని చోట్ల దాడులు చేసే ప్రమాదం స్పష్టంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కుట్రలను బయటపెట్టడం, వాటిని అడ్డుకోవడం కూడా అంత సులభం ఏమీ కాదన్నారు. యూరప్‌లో చాలామంది తమ భాగస్వాములు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇప్పటివరకు ఎంతమంది ఇరాక్, సిరియాలకు వెళ్లి మళ్లీ తిరిగొచ్చారో తెలియడం లేదని, వీళ్లందరిపైనా కన్నేసి ఉంచాలంటే చిన్న విషయం కాదని బ్రెన్నన్ తెలిపారు. ప్యారిస్ ఉగ్రదాడులకు కుట్ర చేసిన వారి కోసం ఫ్రాన్స్, బెల్జియం సహా అనేక ఇతర దేశాలు కూడా తీవ్రంగా గాలిస్తున్నాయి. అయితే ఈలోపే తాము అక్కడి నుంచి సురక్షితంగా బయటకు వెళ్లిపోయామని కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఓ సమావేశంలో బ్రెన్నన్ పాల్గొని ఈ విషయాలు వెల్లడించారు. వాషింగ్టన్ మీద కూడా దాడి చేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరించడంతో.. వాళ్లకు కేవలం ఇరాక్, సిరియా లాంటి ప్రాంతాల్లోనే కాక.. ఇతర ప్రాంతాల్లో కూడా శాఖలు ఉండి ఉంటాయని, వాళ్లే ప్యారిస్ అనంతర దాడులకు సిద్ధం అవుతూ ఉండి ఉంటారని భావిస్తున్నారు. ప్యారిస్ దాడులకు ముందునుంచి వాళ్లు సిద్ధమైన తీరు చూస్తుంటే.. కొన్ని నెలల పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఆత్మాహుతి బెల్టులు, ఇవన్నీ చేయడానికి తగినంత మంది మనుషులు.. ఇలా అన్ని వనరులను సమకూర్చుకుని ఉంటారని బ్రెన్నన్ విశ్లేషించారు. మధ్యప్రాచ్యంలో ఎక్కడో ఓచోట, లేదా యూరప్‌లో భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థలు ఇటీవలే హెచ్చరించాయి. ఈలోపే ప్యారిస్ మీద ఉగ్రదాడులు జరిగాయి.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







