ఇదే నా చివరి ప్రసంగం: సోనియా గాంధీ

- December 15, 2017 , by Maagulf
ఇదే నా చివరి ప్రసంగం: సోనియా గాంధీ

న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల అనంతరం కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న సోనియా గాంధీ ఇవాళ తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఆమె చివరిసారిగా ఆమె ప్రసంగం ప్రారంభించగానే... సభా ప్రాంగణమంతా ''జిందాబాద్ సోనియా గాంధీ''.. ''కాంగ్రెస్ పార్టీ జిందాబాద్''... ''రాహుల్ నాయకత్వం వర్థిల్లాలి..'' అన్న నినాదాలతో మార్మోగిపోయింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడంతో ఆమె కొద్ది సేపు ప్రసంగం ఆపేశారు. తాను గట్టిగా మాట్లాడలేననీ.. టపాసులు కాల్చడం ఆపాలని ఆమె కోరినా కొద్ది సేపటి వరకు శబ్దాలు ఆగలేదు. చివరికి పార్టీ నేతలు కలగజేసుకుని టపాసుల మోత ఆపడంతో ఆమె ప్రసంగం కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...

''కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు. ఆయనకు నా ప్రేమ పూర్వక ఆశీస్సులు. 20 ఏళ్ల క్రితం మీరు నన్ను పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నప్పుడు నేను ఇక్కడే నిలబడి మీతో మాట్లాడాను. అప్పుడు తీవ్ర మానసిక ఒత్తిడితో నా చేతులు వణికాయి. పార్టీ వ్యవహారాలు ఎలా నడిపించాలనే దానిపై నేను ఊహించలేకపోయాను. అప్పట్లో రాజకీయాలతో నాకు కేవలం వ్యక్తిగత సంబంధం మాత్రమే ఉండేది. రాజీవ్ గాంధీని వివాహం చేసుకోవడం ద్వారా ఈ విప్లవాత్మక కుటుంబంలోకి నేను అడుగుపెట్టాను. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మరణంతో దురదృష్ట వశాత్తూ నేను పార్టీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఇందిరా, రాజీవ్‌లను అగౌరవ పర్చకూడదనే అలా నేను రాజీకీయాల్లోకి రావాల్సి వచ్చింది...'' అని సోనియా పేర్కొన్నారు.

ఇప్పటివరకు తనను వెన్నంటి ప్రోత్సహించిన పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపడుతున్న రాహుల్ గాంధీపై తనకు అపార నమ్మకం ఉందనీ.. ఆయన నాయకత్వంలో పార్టీలో సరికొత్త మార్పులు, విజయాలు వస్తాయని ఆకాక్షించారు. తన జీవితం మొత్తంలో గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగానే పార్టీకి సేవలందించానని గుర్తుచేసుకున్నారు. చివరిగా ''జైహింద్'' అంటూ ఆమె ప్రసంగం ముగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com