ఆరేళ్ల తర్వాత వీటో ప్రయోగించిన అమెరికా

- December 19, 2017 , by Maagulf
ఆరేళ్ల తర్వాత వీటో ప్రయోగించిన అమెరికా

న్యూయార్క్‌: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన తీర్మానంపై వీటో ప్రయోగించింది అమెరికా. జెరుసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా ట్రంప్ గుర్తించడాన్ని వ్యతిరేకిస్తూ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించింది. దీనిపై వీటో అస్ర్తాన్ని ప్రయోగించింది. భద్రతా మండలిలో అమెరికా వీటో ప్రయోగించడం ఆరేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. జెరుసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడంతోపాటు అమెరికా ఎంబసీని టెల్ అవీవ్ నుంచి జెరుసలెంకు తరలిస్తున్నట్లు ఈ మధ్యే ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో ఉన్న అమెరికా మిత్రులు కూడా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. ఇది ఆ ప్రాంతంలో ఉద్రిక్తలకు దారి తీస్తాయని సభ్య దేశాలు భావిస్తున్నాయి. 

అయినా అమెరికా మాత్రం వీటో ప్రయోగించడాన్ని సమర్థించుకుంది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని.. మధ్య ప్రాచ్య రక్షణ, శాంతి నెలకొల్పడంలో తమ పాత్రను కాపాడుకోవడంలో భాగంగానే వీటో అస్ర్తాన్ని ప్రయోగించినట్లు అమెరికా స్పష్టంచేసింది. ఇది భద్రతా మండలిలోని సభ్యదేశాలకు ఇబ్బందికర పరిస్థితి అని ఐక్యరాజ్య సమితికి అమెరికా అంబాసిడర్‌గా ఉన్న నిక్కీ హేలీ అన్నారు. భద్రతా మండలిలో ఈ రోజు జరిగిన పరిణామాలను ఓ అవమానంగా భావిస్తున్నాం. ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదానికి మంచి కంటే చెడే ఎక్కువ చేసేలా ఐక్యరాజ్య సమితి వ్యవహరిస్తుందనడానికి ఇదే నిదర్శనం అని ఆమె స్పష్టంచేశారు. తమ ఎంబసీని ఎక్కడ ఉంచాలో చెప్పే హక్కు మిగతా దేశాలకు లేదని, వీటో ప్రయోగించినందుకు ఎంతో గర్వంగా ఉందని నిక్కీ హేలీ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com