గ్రామీణులకు అందుబాటులో ఆన్‌లైన్ షాపింగ్

- December 23, 2017 , by Maagulf
గ్రామీణులకు అందుబాటులో ఆన్‌లైన్ షాపింగ్

హైదరాబాద్: ఈ-కామర్స్ బిజినెస్ మార్కెట్లో రాకెట్‌లా దూసుకుపోతోంది. షాపింగ్ అంటే ఆన్‌లైన్‌లోనే అనేంతగా యూత్‌ను అట్రాక్ట్ చేస్తోంది. అయితే ఇదంతా సిటీస్‌లోనే. మరి గ్రామాల్లో ఇప్పుడది వేగంగా విస్తరిస్తోంది.

ఒకప్పుడు షాపింగ్ పెద్ద పని. గంటల తరబడి సమయం కేటాయించాలి. ఏ చిన్న వస్తువైనా పది షాపులు తిరక్కుంటే వస్తువు కొన్నామన్న ఫీలింగే ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంతపెద్ద వస్తువైనా నిమిషాల్లో కొనేస్తున్నారు. బయట కాలు పెట్టే పనిలేదు. ప్రపంచం అరచేతిలో ఉంటే బయటికి ఎందుకు వెళ్లడం. అంతా ఆన్‌లైన్‌లోనే. నెట్టింట్లో లాగిన్ అయితే చాలు కావాల్సింది పరుగు పెట్టుకుంటూ ఇంటి డోర్ తడుతోంది. టెక్నాలజీ మహత్తు అదంతా. అయితే ఇది కూడా నగరాల వరకే. మరి గ్రామాల సంగతేంటి. ఈ-కామర్స్ సైట్స్ యాక్సెస్ ఉన్నా... డెలివరీ సౌలభ్యం ఇంకా సరిగ్గా లేదు.

కావాల్సిన ప్రతీ వస్తువులు ఈ-కామర్స్ సైట్‌లో కనిపిస్తున్నా వాటిని బుక్ చేయాలంటే వెనకడుగు వేసే పరిస్థితి. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ లాంటి పెద్ద ఈ-కామర్స్ కంపెనీలకే రాష్ట్ర వ్యాప్తంగా 30 నగరాల్లో మాత్రమే డెలవరీ అందుబాటులో ఉంది. దీంతో ఆ గ్యాప్ పూరించాలనే ఆలోచన వచ్చింది ముగ్గురు యువతేజాలకు. హైదరాబాద్ బిట్స్‌లో ఇంజనీరింగ్ చదివిన సిద్దార్థ, యశ్వంత్, స్నేహిత్ కలిసి హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ ఇండియాబయ్స్‌కి శ్రీకారం చుట్టారు. టెక్నాలజీ, ఇంటర్నెట్ ప్రతీపల్లెకీ పాకిన తరుణంలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది హైదరాబాద్ బయ్స్. ప్రతీ మండలానికో ఈ-కామర్స్ స్టోర్‌ని ఏర్పాటు చేసింది. అమేజాన్‌తో టయప్ అయ్యింది.

గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఏ వస్తువును బుక్ చేసినా ఈ స్టోర్ నుంచి డెలివరీ ఉంటుంది. రూరల్ ఏరియాల నుంచి ఎవరు ఆన్‌లైన్లో ఆర్డర్ చేసినా ఈ రూరల్ స్టోర్‌కి వస్తువు డెలివరీ అవుతుంది. అక్కడి నుంచి ఈ స్టోర్ బాయ్స్ డోర్ డెలివరీ చేస్తారు. లేదా కస్టమర్లే వచ్చి తీసుకువెళ్తారు. ఇలా డెలివరీ చేసినందుకు ఎలాంటి అదనపు చార్జీ వసూలు చేయరు. అమెజాన్ నుంచి మాత్రం పర్సెంటేజ్ తీసుకుంటారు. కస్టమర్స్ తమకు కావాల్సిన ఆర్డర్స్ కూడా ఈ స్టోర్స్‌కు వచ్చి చేసుకోవచ్చు. ఎలాంటి ఆర్డరైనా మూడు, నాలుగు రోజుల్లో చేస్తున్నారు.

ఏపీ, తెలంగాణల్లో 120 ఇండియా బయ్స్ స్టోర్లు ఉన్నాయి. ఎక్కడికక్కడ ఫ్రాంచైజీలకు ఇచ్చేశారు. ఎక్కడికక్కడ స్టోర్లు పెట్టడం ద్వారా బిజినెస్ పెంచుకున్న ఇండియా బయ్స్ ... గ్రామీణ ప్రాంతాల్లో స్టోర్స్ ద్వారా ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. త్వరలో కర్నాటక, తమిళనాడులోనూ బిజినెస్ విస్తరించే యోచనలో ఉంది యాజమాన్యం. మొత్తానికి గ్రామీణ ప్రాంత వాసులకు ఈ-కామర్స్‌ సైట్స్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కల్పిస్తోంది ఇండియబయ్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com