మళ్ళీ ఎగురుతున్న ఎయిర్ డెక్కన్

- December 23, 2017 , by Maagulf
మళ్ళీ ఎగురుతున్న ఎయిర్ డెక్కన్

దిల్లీ: దేశీయ తొలి బడ్జెట్‌ విమానయాన సంస్థ ఎయిర్‌డెక్కన్‌ మళ్లీ గగనతలంలో ఎగురుతోంది. నేటి నుంచి ఈ సంస్థ తన సేవలను తిరిగి ప్రారంభించింది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిర్‌డెక్కన్‌ తొలి విమానం డీఎన్‌ 1320 మహారాష్ట్రలోని జల్‌గావ్‌ వెళ్లింది. 'ఇదో గొప్ప ఆరంభం.. ఎయిర్‌డెక్కన్‌ మళ్లీ మొదలైంది' అని సంస్థ ఛైర్మన్‌ కెప్టెన్‌ జీఆర్‌ గోపినాథ్‌ అన్నారు. చౌక ధరలకే విమాన ప్రయాణాన్ని అందించే లక్ష్యంగా 2003లో జీ.ఆర్‌. గోపినాథ్‌ ఎయిర్‌డెక్కన్‌ విమానయాన సంస్థను ప్రారంభించారు. 2008లో ఈ సంస్థ ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో విలీనమైంది. అయితే ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2012లో ఎయిర్‌డెక్కన్‌ సర్వీసులను నిలిపివేశారు. తాజాగా మరోసారి ఈ ఎయిర్‌లైన్‌ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఈసారి సమీప నగరాలు ప్రాధాన్యంగా ఈ సేవలను తిరిగి తీసుకొచ్చారు. మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌, గోపినాథ్‌ కలిసి శనివారం ఈ సేవలను ప్రారంభించారు.

ప్రారంభ విమానంలో ఎయిర్‌డెక్కన్‌ భాగస్వాములతో పాటు కొందరు డీజీసీఏ సీనియర్‌ అధికారులు ప్రయాణించారు. రెండో ఇన్నింగ్స్‌ తొలి దశలో భాగంగా ముంబయి- జల్‌గావ్‌, ముంబయి- నాసిక్‌, ముంబయి- కోల్హాపూర్‌, పుణె-జల్‌గావ్‌, పుణె-నాసిక్‌, పుణె-కోల్హాపూర్‌ మార్గాల్లో ఈ విమానాలను నడుపుతున్నారు. రూ. 2,250 నుంచి ఈ టికెట్‌ ధరలు ప్రారంభం కానున్నాయి.

త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com