క్రిస్మస్ సంబరాలు సంబరాలకు దూరంగా ఫిలిప్పీన్స్...!!

- December 25, 2017 , by Maagulf
క్రిస్మస్ సంబరాలు సంబరాలకు దూరంగా ఫిలిప్పీన్స్...!!

క్రిస్‌మస్ ముందు రోజు ఫిలిప్పీన్స్ ను విషాదం ముంచెత్తింది. టెంబ్లిన్ తుపాను కారణంగా దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. జనావాసాలపై హఠాత్తుగా వరదనీళ్లు రావడంతో 200 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. దీంతో ఫిలిప్పీన్స్‌లోని రెండో అతిపెద్ద ద్వీపం మిండానావోలో పరిస్థితి దయనీయంగా ఉంది.

ఫిలిప్పీన్స్‌లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ, టెలీఫోన్ లైన్లు తెగిపోయాయి. దీంతో సహాయచర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎమర్జెన్సీ సర్వీసులతోపాటూ సైనికులు, పోలీసులు, వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వారం క్రితం వచ్చిన కేయ్‌టెక్ తుపానుకు 50 మంది చనిపోగా.. క్రిస్మస్ సంబరాలకు ముందు టెంబ్లీన్ 200 మందిని బలి తీసుకోవడం చాలా కుటుంబాల్లో విషాదం నింపింది. 

ముందస్తు హెచ్చరికలు వచ్చినా కొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లకపోవడంతో ప్రాణనష్టం ఎక్కువైంది. ఏడాదికి 20 తుపానులను చూసే ఫిలిప్పీన్స్‌ మిండానోవా ప్రజలు ట్రెంబ్లీన్ తుపానును కూడా సీరియస్‌గా తీసుకోలేదు. హఠాత్తుగా వరదనీళ్లు ఇళ్లను ముంచెత్తడంతో స్థానికులు నీటిలో మునిగి చనిపోయారు. ఈ విపత్తులో 159 మంది గల్లంతవగా.. 70 వేల మంది తమ ఇళ్లు ఖాళీ చేశారు.

ట్రెంబ్లిన్ తుపాను దక్షిణ వియత్నాం వైపు ప్రయాణిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఫిలిప్పీన్స్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. వాటికన్‌ సిటీలోని సెయింట్ పీటర్ స్క్వేర్‌లో కూడా పోప్ ఫ్రాన్సిస్ మిండనోవా బాధితుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com