రజినీకాంత్‌ పొలిటికల్ ఎంట్రీ పై మరోచారి ప్రచారం

- December 25, 2017 , by Maagulf
రజినీకాంత్‌ పొలిటికల్ ఎంట్రీ పై మరోచారి ప్రచారం

రాజకీయ ప్రవేశంపై ఈ నెల 31వ తేదీన నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ తమిళనాట ఉత్కంఠ పెంచేశారు తలైవా రజినీకాంత్‌. రాజకీయాలు తనకు కొత్త కాదన్న సూపర్‌స్టార్.. తాను ఆలస్యం చేశానంటూ అభిమానులకు వివరణ ఇచ్చారు. రాజకీయాల్లోకి రావాలంటే లాభనష్టాలు.. లోతుపాతులు అంచనా వేసుకోవాలన్నారు. ఏదో వచ్చామా వెల్లామా అని కాకుండా.. యుద్ధంలోకి దిగితే గెలిచి తీరాలన్నారు రజనీకాంత్‌. అయితే.. యుద్ధంలో గెలవడానికి వీరత్వం ఒకటే ఉంటే సరిపోదని వ్యూహం కూడా కావాలన్నారు. 

రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయి. రజినీ రాజకీయాల్లోకి రావాలని దేవుడు డిసైడ్‌ చేసేశాడంటరూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రజినీ వ్యాఖ్యలను చూసినా.. గ్రౌండ్‌వర్క్‌ భారీ స్థాయిలో చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ అభిమానులతో సమావేశం కానున్న రజినీ.. చివరిరోజు.. రాజకీయ ప్రవేశంపై పూర్తిస్థాయిలో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది మే నెలలో అభిమానులతో సమావేశమయ్యారు రజినీకాంత్‌. అప్పట్లోనే రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తారంటూ ప్రచారం సాగినా.. ఏమీ తేల్చలేదు తలైవా. యుద్ధానికి సిద్ధం కండి అంటూ పిలుపిచ్చి వదిలేశారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానంటూ చెప్పినా.. ఈ ఏడునెలల్లో ఆ మేరకు ప్రయత్నాలేవీ జరగలేదు. అటు.. విశ్వనాయకుడు కమల్‌ హాసన్ రాజకీయాల్లోకి వచ్చేశానంటూ ప్రకటించడం.. తమిళ పాలిటిక్స్‌లో హైడ్రామా సాగుతుండడంతో.. రజినీ రాజకీయాల్లోకి రావాలన్న ఒత్తిడి అభిమానుల నుంచి పెరుగుతోంది. 

ఇప్పుడు రజినీ చేసిన ప్రకటనతో.. తమిళ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. తమిళనాడులో కొనసాగుతున్న అన్నాడీఎంకే ప్రభుత్వానికి దినకరన్‌ రూపంలో గండం పొంచి ఉంది. మూడు నెలల్లో ప్రభుత్వం పడగొడతానంటూ ప్రకటించిన దినకరన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం ద్వారా సీఎం పళని స్వామి చుట్టూ ఉచ్చు బిగించబోతున్నారు దినకరన్‌. ఒకవేళ అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోతే .. మధ్యంతర ఎన్నికలు తప్పకపోవచ్చు. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్‌లు బలహీనంగా ఉండడం, కమల్‌ హాసన్‌ ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో.. అందరి దృష్టి రజినీపైనే ఉంది. కమల్‌తో పోల్చితే.. వ్యక్తిత్వ పరంగా, ఇమేజ్ పరంగా  రజినీకాంత్‌ ఎన్నో రెట్లు పైస్థాయిలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే పార్టీ పెడితే.. ఘనవిజయం సాధించడమూ ఖాయంగా కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com