ఇద్దరూ అంగీకరిస్తే మధ్యవర్తిత్వానికి రెడీ : రష్యా

- December 26, 2017 , by Maagulf
ఇద్దరూ అంగీకరిస్తే మధ్యవర్తిత్వానికి రెడీ : రష్యా

ఉ.కొరియా-అమెరికా మధ్య కొనసాగుతున్న వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇరుదేశాలూ అంగీకరిస్తే వివాద పరిష్కార చర్చలకు సారధ్యం వహించేందుకు తాము సిద్ధంగా వున్నామని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ఒక ప్రకటనలో వివరించింది. ఉ.కొరియా వరుస అణు, క్షిపణి పరీక్షల నేపథ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరువర్గాలు చర్చా వేదికపైకి రావాలని రష్యా దీర్ఘకాలంగా సూచిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా-ఉ.కొరియా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత పెరగకుండా మార్గాన్వేషణ చేసేందుకు రష్యా సిద్ధంగా వుందని క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్‌ మీడియాకు చెప్పారు. ఇరుదేశాలూ చర్చలకు అంగీకరిస్తే తాము మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా వున్నామని సోమవారం నాడు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లెవరోవ్‌ చేసిన ప్రకటనను ఆయన పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య వివాదానికి తాము దౌత్య పరమైన పరిష్కారానికి కృషి చేస్తుంటే అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం ఉ.కొరియా అణ్వస్త్ర కార్యక్రమాలకు తెరదించితే తప్ప చర్చలకు రాబోమని స్పష్టం చేస్తున్నారని అమెరికా దౌత్యవేత్తలు చెబుతున్నారు. ఉ.కొరియా ఇటీవల జరిపిన క్షిపణి పరీక్షపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఐరాస భద్రతా మండలి తాజా ఆంక్షలు విధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com