ఫోన్ లో తలాక్ చెప్పిన భర్త

- December 27, 2017 , by Maagulf
ఫోన్ లో తలాక్ చెప్పిన భర్త

ఒమన్‌ షేక్ చేతిలో దారుణంగా మోసపోయింది పాతబస్తీకి చెందిన గౌసియా బేగం. ఎనిమిదేళ్ల క్రితం ఆమెను పెళ్లి చేసుకున్న ఒమన్‌ షేక్‌.. ఫోన్‌లో తలాక్‌ చెప్పి చేతులు దులిపేసుకున్నాడు. ఈ పెళ్లికి మధ్యవర్తిత్వం వహించిన ఖాలా, ఖాలూలను నిలదీస్తే.. మరో వివాహం చేస్తామంటున్నారంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది గౌసియా. తనకు న్యాయం చేయాలంటూ కోరుతోంది.

కాంట్రాక్ట్‌ మ్యారేజ్‌ల కారణంగా అమ్మాయిల జీవితాలు నాశమనమైపోతాయని తెలిసినా.. పాతబస్తీలో మార్పు రావడం లేదు. తాత్కాలికంగా అందే డబ్బుకు ఆశపడి.. తమ కూతుళ్లను ఒమన్‌ షేక్‌ల చేతుల్లో బలిపశువులను చేస్తున్నారు పేదింటి తల్లిదండ్రులు. గౌసియా బేగం తల్లిదండ్రులు కూడా.. ఎనిమిదన్నరేళ్ల క్రితం ఒమన్‌షేక్‌ జహరన్‌ హమీద్‌ అల్‌ రజీ అనే వృద్ధుడికిచ్చి పెళ్లి చేశారు. దాదాపు ఎనిమిది మంది అమ్మాయిలను చూసిన తర్వాత.. తనను హమీద్ సెలెక్ట్ చేసుకున్నాడంటోంది గౌసియా. ఖాలా, ఖాలూలు తనను హమీద్‌ దగ్గరకు తీసుకెళ్లారంటోంది.  హైదరాబాద్‌లో ఇల్లు కొనిస్తాననని ఆ సమయంలో హామీ ఇచ్చాడంటోంది. 2008 ఆగస్టు 11న హైదరాబాద్‌లోనే గౌసియా, హమీద్‌కు నిఖా జరిగింది. కొన్ని రోజులు ఇక్కడే ఉన్న హమీద్‌..గౌసియాను వదిలి  వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ప్రతీ ఏటా హైదరాబాద్ వస్తూ.. కొన్ని రోజులు ఉండి వెళ్లి పోతున్నాడు. ఇల్లు సంగతిని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాడు. ఇప్పుడు సడన్‌గా ఫోన్ చేసి తలాక్ చెప్పాడంటూ కన్నీటి పర్యంతం అవుతోంది. 

ఒమన్ షేక్ చేతిలో మోసపోయిన తనకు న్యాయం చేయాలని కోరుతూ.. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాసింది గౌసియా. తనలాంటి ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న ఖాలా, ఖాలూలపై  చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com