ముస్లిం మహిళల సాధికారత దిశగా గొప్ప ముందడుగు

- December 28, 2017 , by Maagulf
ముస్లిం మహిళల సాధికారత దిశగా గొప్ప ముందడుగు

కేంద్రం ప్రతిపాదించిన ట్రిపుల్ తలాక్ బిల్లులో కీలకాంశాలున్నాయి. బాధిత మహిళల గౌరవానికి, భద్రతకు పెద్ద పీట వేస్తూ బిల్లుకు రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని ఉప సంఘం పకడ్బందీగా బిల్లును సిద్ధం చేసింది. అది లోక్‌సభలో ప్రవేశ పెట్టడం,  ఆమోదం పొందడంతో రాజ్యసభ ఆమోదం తర్వాత చట్టరూపు సంతరించుకోనుంది. మరి ఈ పరిణామంతో రాబోయే రోజుల్లో పరిస్థితి మారుతుందా? ముస్లిం మహిళలకు భద్రత దొరుకుతుందా??

లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు ఆమోదం లభించడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. కేవలం ముస్లిం మహిళలు, బాధితులే కాదు.. మహిళలంతా ముక్తకంఠంతో బిల్లును స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ట్రిపుల్‌ తలాక్‌ బాధితులు బిల్లుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఈ బిల్లుతో తమ లాంటి వారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ఈ బిల్లుతోనైనా ట్రిపుల్‌ తలాక్‌కు అడ్డుకట్ట పడుతుందని ఆశిస్తున్నారు. 

అటు ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీకి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో అసదుద్దీన్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేసి.. నినాదాలు చేశారు ముస్లిం మహిళలు. 

కొత్త బిల్లు ప్రకారం... నోటి మాటగా కానీ, రాతపూర్వకంగా కానీ, ఫోన్‌లో కానీ,ఎస్ఎంఎస్ ,వాట్సాప్, ఈమెయిల్‌ ఏ రకంగా అయినా ట్రిపుల్ తలాక్ చెప్పడం క్రిమినల్ నేరం. దానికి మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. జరిమానా కూడా విధించొచ్చు. ఎంత జరిమానా అనేది న్యాయమూర్తి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మైనర్ పిల్లలుంటే వారి సంరక్షణకు మహిళ భరణం కోరవచ్చు. పిల్లలను తన దగ్గరే ఉంచాలని కోర్టును మహిళ కోరవచ్చు. అయితే, అది తుది తీర్పును బట్టి ఉంటుంది. 

ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం గత ఆగస్టులో చరిత్రాత్మక తీర్పు చెప్పింది. దీనిపై చట్టం తీసుకురావాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర మంత్రుల బృందం ఈ బిల్లుకు రూపకల్పన చేసింది. రాష్ట్రాలకు పంపి.. వారి సూచనలు, సలహాలు తీసుకుంది. గత కేంద్రకేబినెట్ సమావేశంలోనే బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే, ఈ బిల్లు నుంచి జమ్మూ కాశ్మీర్‌ను మినహాయించారు. 

ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సాక్షాత్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. నవంబర్ చివరినాటికి ఇలాంటివి 66 కేసులు నమోదైనట్టు లెక్క తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com