రోబోలు వస్తున్నాయి.. మహిళల ఉద్యోగాలు చెక్

- January 24, 2018 , by Maagulf
రోబోలు వస్తున్నాయి.. మహిళల ఉద్యోగాలు చెక్

- అధ్యయన నివేదిక హెచ్చరిక 
బీజింగ్‌ : రోబోలు వచ్చేస్తున్నాయి....మహిళల ఉద్యో గాలు పోతున్నాయి. ఇదేంటా అనుకుంటున్నారా! కృత్రిమ మేథస్సు (ఎఐ) మన ఉద్యోగాలపై చూపిస్తున్న ప్రభావం ఇది. ఈ విషయంలో ముందుగా ముప్పు ఎదుర్కొనేది మహిళలే అని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్‌) సమావేశాల్లో సమర్పించిన కొత్త అధ్యయన నివేదిక పేర్కొంది. ''నైపుణ్యాల విప్లవం దిశగా : మనందరి ఉద్యోగాల భవితవ్యం'' శీర్షికతో ఈ నివేదిక వెలువడింది. కృత్రిమ మేథస్సు అనేది మనకి పనేమీ లేకుండా చేయడం మొదలుపెడుతోందని, ఇందులో ముందుగా ఉపాధి కోల్పోయేది మహిళలేనని నివేదిక పేర్కొంది. అమెరికాలో 96శాతం ఉపాధి కల్పిస్తున్న దాదాపు వెయ్యి రకాల ఉద్యో గాలపై అధ్యయనం జరిగింది. ఇందులో 57శాతం మంది ఉపాధి కోల్పోయేటువంటి ముప్పును ఎదుర్కొంటున్నారు. వీరందరూ కూడా మహిళలేనని నివేదిక తెలుపుతోంది. 2026 నాటికి, సాంకేతికత కారణంగా దాదాపు 14లక్షల ఉద్యోగాలు అంతర్థానమవనున్నాయి.

ఇది ఆందోళన కలిగించే పరిణామమని అధ్యయన నిర్వాహకులు పేర్కొం టున్నారు. ఇప్పటికే పనిప్రదేశాల్లో స్త్రీ, పురుషుల మధ్య అంతరం పెరుగుతూ వస్తోందని, లేబర్‌మార్కెట్‌లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోతోందని, ఇటువంటి తరుణంలో ఈ పరిణామం మరింత ఆందోళన కలిగిస్తోందని నివేదిక రూపకర్తలు పేర్కొన్నారు. ఇలా ముప్పును ఎదుర్కొనే వారిలో 95శాతం మంది అధిక వేతన చెల్లింపు ఉద్యోగాల్లోనే వున్నారని తేలుతోంది. ఈ 95శాతం మందిలో 74శాతం మంది మహిళలే వున్నారు.

రోబోలు వస్తే ఉద్యోగాలు పోయే ముప్పును ఎదుర్కొనే ఉద్యోగులు తమ నైపుణ్యాలకు మెరుగు పెట్టుకునే పనిలో వుండాలని, జీవితాంతం నేర్చుకుంటూనే వుండాలని ఆ అధ్యయనం సూచించింది. యాజమాన్యాలు కూడా తమ సిబ్బంది నైపుణ్యాలకు పదును పెట్టే చర్యలు తీసుకోవాల్సిందేనని సిఫార్సు చేసింది. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు, బర్నింగ్‌ గ్లాస్‌ టెక్నాలజీస్‌ సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com