మరో ముప్పు

- November 24, 2015 , by Maagulf
మరో ముప్పు

వానలు, వరదలతో విలవిల్లాడుతున్న రాయలసీమ, దక్షిణ కోస్తాలకు పిడుగులాంటి వార్త ఇది. మూడువారాల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మరో ముప్పు ముంచుకొచ్చేలా ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. గురువారం నాటికి అల్పపీడనంగా బలపడబోతోంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు ఆనుకుని అల్పపీడనద్రోణి ఉపరితల ఆవర్తనంతో కలసి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాయలసీమపై ఈశా న్య రుతుపవనాలు బలంగా ఉన్నాయి. ఫలితంగా రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. వాయుగుండంగా మారనుందా? అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాయుగుండంగా బలపడకపోయినా అల్పపీడనం ప్రభావంతోనైనా భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. దీని ప్రభావం ఉత్తర కోస్తాకంటే దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అధికంగా ఉంటుందని అంటున్నారు. ఈ నెల 28 నుంచి కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తాజా నివేదికలో వెల్లడించింది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు బలం పుంజుకుంటూనే ఉన్నాయి. కొద్దిరోజుల నుంచి అల్పపీడనం లేకపోయినా ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాయలసీమ, దక్షిణకోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న అల్పపీడనానికి ఈశాన్య రుతుపవనాలు తోడైతే భారీ వర్షాలకు ఆస్కారం ఉంటుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గడచిన 24 గంటల్లో పాలసముద్రంలో 7 సెం.మీలు, చిత్తూరు, పలమనేరు, వెంకటగిరికోటల్లో 5, పాకాల, గోరంట్లల్లో 4, శాంతిపురం, ధర్మవరం, పుంగనూరు, కుప్పం, చెన్నేకొత్తపల్లి, మదనపల్లె, సింహాద్రిపురం, బత్తల పల్లె, నగరి, వెంకటగిరిల్లో 3, పెనుకొండ, తిరుమల, తనకల్, లేపాక్షి, ఆరోగ్యవరం, తాడిమర్రిల్లో రెండేసి సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com