కొత్త బిజినెస్‌లో అడుగుపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్

- February 04, 2018 , by Maagulf
కొత్త బిజినెస్‌లో అడుగుపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్

కోలీవుడ్‌లో బిజీ సంగీత దర్శకుడయిన ఆ కుర్రోడు.. ట్యూన్స్ కట్టడంతోనే ఆగకుండా సరికొత్త బిజినెస్‌లోకి దిగాడట. బాగా తెలిసిన రంగంలో రాణిస్తే ఎవరికయినా పేరొస్తుంది. అయితే అక్కడితో ఆగకుండా మరో రంగంలో కూడా అడుగుపెట్టి తన సత్తా చాటితే పేరుతో పాటు నలుగురితోనూ మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. అది వ్యాపారాన్ని విస్తరింపచేసుకోడానికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫార్ములాను బాగా వంట పట్టించుకున్నట్టున్నాడు కోలీవుడ్ కుర్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్. మనోడిప్పుడు కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

కోలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే సంగీత దర్శకుడిగా టాప్ చెయిర్ అధిరోహించాడు అనిరుధ్ రవిచంద్రన్. అతి వేగంగా బాణీలు అందిస్తూ దర్శక, నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన ఈ కుర్రోడు ఇప్పుడు తన స్నేహితులతో కలసి చెన్నైలో 'సమ్మర్ హౌస్ ఈటరీ' పేరుతో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఒక పక్క వరుస సినిమాలు చేస్తూనే మరో పక్క కొత్త రెస్టారెంట్ వ్యవహారాల్లో అనిరుధ్ తలమునకలయి ఉండడాన్ని పలువురు అభినందిస్తున్నారు.

ఇప్పటి వరకూ పాటలకోసం సరిగమలు పలికించిన ఈ కుర్రోడు, ఇప్పుడు సరికొత్త వంటకాలతో ఘుమఘుమలు అందించనున్నాడని కోలీవుడ్ జనం చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఈ రంగంలోకి క్రికెటర్స్ దగ్గరనుంచి సినిమా నటుల వరకూ అందరూ ప్రవేశించి లాభాల బాట పట్టడంతో అనిరుధ్‌కు ఈ రంగం మీద బాగా నమ్మకం కలిగిందట. అనిరుధ్ తన సంగీతంతో ఇప్పటికే చాలా మంది దర్శక నిర్మాతలకు ఆత్మీయుడయ్యాడు. ఆ స్నేహ సంబంధాన్ని తన వ్యాపార విస్తరణ కోసం ఉపయోగించుకుంటే అతడి సంగీతం లాగే రెస్టారెంట్ బిజినెస్ కూడా మూడు పువ్వులు ఆరుకాయలుగా వెలుగొందుతుందంటున్నారు. మరి అనిరుధ్ కొత్త బిజినెస్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com