సౌదీ అరేబియా లో విదేశీ కార్మికులపై నిషేధం
- February 06, 2018
సౌదీ అరేబియా ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాటలో నడుస్తున్నది. దేశంలోని 12 రంగాల్లో విదేశీయులు పనిచేయడాన్ని నిషేధించింది. సౌదీకి దశాబ్దాలుగా సేవలందిస్తున్న 1.2 కోట్ల మంది విదేశీయులపై ప్రభావం చూపనున్నది. ఇందులో దాదాపు 30 లక్షల మంది భారతీయులే. వీరిలో కులవృత్తులు చేసుకుంటూ, అపాయకరమైన పనులు చేస్తూ, చిన్న చిన్న ఉద్యోగాలతో జీవితం నెట్టుకొస్తున్నవారే అధికం. ఈ నూతన విధానానికి సౌదీ కార్మిక, సామాజిక అభివృద్ధి శాఖల మంత్రి డాక్టర్ అలీ బిన్ నాసర్ అల్ ఘఫీస్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. దేశంలో నిరుద్యోగ శాతం విపరీతంగా పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
2020 నాటికి నిరుద్యోగరహిత దేశంగా..
అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాల ప్రకారం గత ఏడాది సౌదీ అరేబియాలోని 15 నుంచి 24 ఏండ్ల మధ్య వయసున్న యువతలో 32.6 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం 2020 నాటికి దేశాన్ని నిరుద్యోగ రహితంగా తయారు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విదేశీ ఉద్యోగులపై నిషేధం విధించింది. నూతన విధానం ప్రకారం సౌదీ కార్మిక, సామాజిక అభివృద్ధి శాఖ 12 రంగాల్లో విదేశీయులు పనిచేయడాన్ని క్రమంగా నియంత్రిస్తుంది. ఏడాదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు వివిధ రంగాలకు గడువు విధించింది.
సౌదీ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం..
-ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీ నుంచి కార్లు, బైక్ షోరూంలు, రెడీమేడ్ బట్టల దుకాణాలు, ఫర్నీచర్ దుకాణాలు, గృహోపకరణాల దుకాణాల్లో విదేశీయులు ఉద్యోగులుగా ఉండరాదు. -ఈ ఏడాది నవంబర్ 9వ తేదీ నుంచి ఎలక్ట్రానిక్స్ స్టోర్స్, గడియారాల దుకాణాలు, కండ్లద్దాల దుకాణాల్లో విదేశీయులను నియమించుకోవడంపై నిధేధం అమల్లోకి వస్తుంది. -2019 జనవరి 7వ తేదీ నుంచి వైద్యపరికరాల తయారీ, సరఫరా దుకాణాలు, భవన నిర్మాణ సరుకుల దుకాణాలు, ఆటో స్పేర్ పార్టుల దుకాణాలు, కార్పెట్లు అమ్మే దుకాణాలు, స్వీట్ షాపుల్లో విదేశీయులు పనిచేయడానికి వీల్లేదు.
భారత్‌కు కీలక భాగస్వామి
వాణిజ్య పరంగా భారత్‌కు సౌదీ అరేబియా కీలక భాగస్వామి. చైనా, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తర్వాత మన దేశానికి సౌదీ అరేబియా నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నది. భారత ఇంధన అవసరాలను తీర్చడంలో సౌదీ కీలకపాత్ర పోషిస్తున్నది. మన ఇంధన దిగుమతుల్లో దాదాపు 20 శాతం సౌదీ అరేబియా నుంచే వస్తున్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి