రాజధాని అమరావతి కోసం సేకరించిన 8300 ఎకరాలు..

- November 26, 2015 , by Maagulf
రాజధాని అమరావతి కోసం సేకరించిన 8300 ఎకరాలు..

రాజధాని అమరావతి కోసం సేకరించిన భూమిలో రైతుల వాటా కింద అభివృద్ధి చేసిన 8300 ఎకరాలు వస్తుందని రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సిఆర్‌డిఎ) సమావేశంలో తేల్చారు. బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చించారు. రైతులకు ఇచ్చే ప్లాట్ల సైజు 125 గజాల నుంచి 4 వేల గజాల వరకు ఉండేలా విభజించారు. ఈ ప్లాట్ల డిజైనకు నాలుగు నెలల సమయం పడుతుందని అధికారులు చెప్పగా రెండు నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రైతులతో సమావేశం నిర్వహించి ఈ ప్లాట్లపై వారితో చర్చించాలని సూచించారు. రాజధాని కోర్‌ క్యాపిటల్‌ పరిధిలో నిర్మించబోయే భవనాలలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, సీఎం నివాసం, మంత్రులు, ఎమ్మెల్యే క్వార్టర్స్‌, జడ్జిల నివాసాలు, ఐఏఎస్‌. ఐపీఎస్‌ అధికారుల నివాసాలు, గెజిటెడ్‌, నాన గెజిటెడ్‌ ఉద్యోగుల నివాసాలతో పాటు నాలుగవ తరగతి ఉద్యోగుల క్వార్టర్‌లు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు. రోడ్లు, డ్రైయినేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఎంత అవుతుందన్న విషయంపై పూర్తి స్థాయి అంచనాలను ఈ సమావేశంలో వెల్లడించలేదు. జాతీయ రహదారిపై తాడేపల్లి నుంచి కోర్‌క్యాపిటల్‌ వరకు 16 కిలో మీటర్ల హైవేని నిర్మించే విషయమై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ రహదారి వంపులు లేకుండా నేరుగా నిర్మించాలని సీఎం ఆదేశించారు. కొండలు ఉన్నచోట టనెల్స్‌, కొండవీటి వాగు వచ్చే ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలని సీఎం సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com