ముక్కోణపు టీ 20 సిరీస్‌లో శ్రీలంక పై భారత్ ఘన విజయం

- March 12, 2018 , by Maagulf
ముక్కోణపు టీ 20 సిరీస్‌లో శ్రీలంక పై భారత్ ఘన విజయం

ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్నిభారత్‌ జట్టు మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తద్వారా లంకేయులతో ఆరంభంలో ఎదురైన ఓటమి ప్రతీకారం తీర్చుకుంది.

భారత్‌ బ్యాటింగ్‌లో మనీష్‌ పాండే‌(42), దినేశ్‌ కార్తీక్‌‌(39)లు రాణించి విజయంలో సహకరించారు. అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక జట్టు దాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఉనాద్కత్‌ వేసిన తొలి ఓవర్‌లోనే 15 పరుగుల్ని పిండుకుంది. అయితే ఆ తర్వాత ఓవర్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ కుదరుగా బౌలింగ్‌ చేసి తొమ్మిది పరుగుల ఇవ్వగా,  శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన మూడో ఓవర్‌లో గుణతిలకా(17) పెవిలియన్‌ చేరాడు.

ఆపై స్వల్ప వ్యవధిలో కుశాల్‌ పెరీరా(3)ను వాషింగ్టన్‌ సుందర్‌ పెవిలియన్‌ పంపాడు. దాంతో లంక 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కాగా, కుశాల్‌ మెండిస్‌తో కలిసి మూడో వికెట్‌కు 62 పరుగులు జత చేసిన తర్వాత ఉపుల్‌ తరంగా(22) పెవిలియన్‌ చేరాడు. తిషారా పెరీరా(15), జీవన్‌ మెండిస్‌(1)లు అవుటైన కాసేపటికి కుశాల్‌ మెండిస్‌(55;38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక‍్సర్లు) ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో శ్రీలంక స్కోరు బోర్డులో వేగం తగ్గింది.  

చివరి వరుస ఆటగాళ్లలో షనకా(19) ఫర్వాలేదనిపించడంతో శ్రీలంక నిర్ణీత 19 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 152పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ నాలుగు వికెట్లతో మెరవగా, వాషింగ్టన్‌ సుందర్‌ రెండు వికెట్లు తీశాడు. ఇక చాహల్‌, విజయ్‌ శంకర్‌, ఉనాద్కత్‌లకు తలో వికెట్‌ దక్కింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com