నష్టాలను ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌

- March 19, 2018 , by Maagulf
నష్టాలను ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భారీ చిక్కుల్లో పడింది.  తాజాగా యూరోపియన్ యూనియన్ గోప్యతా నియమాలకు సంబంధించి విచారణ నేపథ్యంలో గణనీయమైన వ్యాపార నష్టాలను ఎదుర్కొంటోంది.  50 మిలియన్ల మంది ఫేస్‌బుక్‌  ఖాతాల వివరాలు లీక్‌ అయ్యాయన్న ఆరోపణలు ఫేస్‌బుక్ షేర్‌ను తీవ్ర నష్టాల్లోకి జార్చాయి. అంతేకాదు  మార్కెట్‌ క్యాప్‌ రాత్రికి రాత్రే తీవ్రంగా నష్టపోయింది. డాటా బ్రీచ్‌ వార్తలతో మార్క్‌ జుకర్‌బర్గ్‌ 2004 లో స్థాపించిన ఫేస్‌బుక్‌  విలువలో 40 బిలియన్ డాలర్ల విలువ తుడిచిపెట్టుకుపోయింది. 2004 తరువాత ఇదే అతిపెద్ద  క్షీణత అని ఎనలిస్టులు చెబుతున్నారు.

ట్రంప్‌ ఎన్నికల సభలకు సంబంధించిన అంశాలు 5కోట్లమంది ఫేస్‌బుక్‌ యూజర్లకు ఎలా అందాయన్న అంశంపై యూఎస్‌, యూరోపియన్‌ న్యాయశాఖ అధికారులు ఫేస్‌బుక్‌ చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ను విచారించారన్న అంశం ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైంది. దీంతో ఫేస్‌బుక్‌సహా టెక్నాలజీ దిగ్గజాలపై నియంత్రణలు పెరగవచ్చన్న అంచనాలు టెక్నాలజీ కౌంటర్లను దెబ్బతీసినట్లు నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో ఫేస్‌బుక్‌ 7 శాతం దిగజారింది. అల్ఫాబెట్‌ 3 శాతం, మైక్రోసాఫ్ట్‌ 2 శాతం, యాపిల్‌ 1.5 శాతం చొప్పున పతనమయ్యాయి. దీంతో మార్కెట్లు నీరసించినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ఫేస్‌బుక్‌ కారణంగా టెక్నాలజీ దిగ్గజాలలో భారీ అమ్మకాలు నమోదుకావడంతో ప్రధానంగా సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com